అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులు కష్టాలు??

భారత్‌కు చెందిన లెరీనా అనే విద్యార్థిని కెనడాలోని ఒక యూనివర్సిటీలో చదువుతున్న నేపథ్యంలో అక్కడకు వెళ్లడానికి విమానం ఎక్కింది. నేరుగా ఆమె కెనడాకే వెళ్లి ఉంటె సుమారు 22 గంటల్లో ప్రయాణం ముగిసేది. అందుకయ్యే ఖర్చు రూ.1.5 లక్షల లోపు ఉండేది. కానీ నేరుగా వెళ్లే విమానం లేకపోవడంతో మొదట దిల్లీ నుంచి దుబాయికి వెళ్లింది. అక్కడ బార్సిలోనా విమానం కోసం 9 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మెక్సికో విమానం కోసం మరో 2 గంటలు వేచి చూసింది. తదుపరి మెక్సికోలో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకుని ఫలితాల కోసం రెండు రోజులు ఎదురు చూసింది. ఆ తర్వాత వాంకోవర్‌కు, అక్కడి నుంచి కెనడాకు చేరుకుంది. దీనికి ఆమెకు అయిన ఖర్చు రూ.5 లక్షలపైనే.

ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌లో బోధించిన కెనడా విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నేరుగా తరగతి గది బోధనను ప్రారంభించాయి. దీంతో అక్కడకు వెళ్లడానికి విద్యార్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ భారత్‌ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా ఇంకా ఆంక్షలు కొనసాగిస్తూనే ఉండడంతోనే అసలు సమస్య మొదలయ్యింది. రెండో ఉద్ధృతి సమయంలో విధించిన నిషేధాన్ని సెప్టెంబరు 21 వరకూ పొడిగించింది. దీనివల్ల కెనడాకు వెళ్లాలనుకునేవారు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తోంది. కెనడా ఆంక్షలు విధించని దేశానికి ముందు వెళ్లి, అక్కడి నుంచి కెనడాకు వెళ్లాల్సి రావడంతో ప్రయాణ దూరం పెరిగి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. గోరుచుట్టుపై రోకలిపోటులా దీనికి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల నిబంధనలూ తోడవుతున్నాయి.

భారత్‌లో చేయించుకునే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలను కెనడా ఆమోదించకపోవడంతో కెనడా ధ్రువీకరించిన జాబితాలో ఉన్న దేశంలోనే పరీక్ష చేయించుకోవాల్సి వస్తోంది. ఆ ఫలితాలు వచ్చేవరకూ అక్కడే ఆగాల్సిన పరిస్థితి. దీనికి కనీసం రెండు రోజులు పడుతుండడంతో అక్కడే బస చేయాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం అధికం కావడంతో పాటు ఖర్చులూ విపరీతంగా పెరిగిపోతున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల నాణ్యతపై కెనడా ప్రభుత్వానికి నమ్మకం లేకపోతే, ఫలానా ల్యాబ్‌లో చేయించుకొమ్మని సూచించవచ్చని, లేదా విమానాశ్రయాల్లో ఆ ఏర్పాట్లు చేసే దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రోజుకు లక్ష కేసులు వస్తున్న అమెరికా నుండి కూడా విమాన ప్రయాణాలను అనుమతిస్తున్న కెనడా భారత్ పై మాత్రం నిషేధం విధించడం విడ్డూరం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •