నగరంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. హోంమంత్రి సొంత నియోజకవర్గం పత్తిపాడు మండలపరిధిలోని బోయపాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. వైసీపీ శ్రేణులు మద్యం మత్తులో చంద్రబాబును దూషించడంతో అక్కడే ఉన్న వెంకటనారాయణ వారిని అడ్డుకున్నాడు. జగన్ వచ్చిన తర్వాతే మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని, చంద్రబాబు ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడితనం లేదని అనగా మాకే ఎదురు సమాధానం చెబుతావా? అంటూ వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టే యత్నం చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన వెంకటనారాయణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెదనందిపాడు మండలం, కొప్పర్రుకు చెందిన వెంకటనారాయణ సోమవారం పెద్దకుర్రపాడు అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడు దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త కావడంతో ఈ ఘటనపై టీడీపీతోపాటు అన్ని వర్గాలకు చెందిన దళితులలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.