కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం నుండి తప్పుకుంటేనే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతుల ఉసురు పోసుకుంటోందని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొన్న మాట్లాడుతూ ఆక్షేపించారు.

‘‘దేశంలో మూడు రకాల ప్రభుత్వాలున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండోది రాష్ట్ర ప్రభుత్వం, మరొకటి స్థానిక సంస్థలు. మిగతా రెండు సమర్థవంతంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పని చేయడం లేదు. అబద్ధపు పునాదుల మీద భాజపా రాజకీయం చేస్తూ తెలంగాణలో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో భాజపా ఆటలు చెల్లవు. ఇక్కడ అసత్య ప్రచారాలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు చేయించేలా చూడాలి అంటూ సవాల్ విసిరారు.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వివరిస్తూ తెరాస నాయకులు గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేయాలి. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న భాజపా నాయకులను రైతులు, కార్యకర్తలు తరిమికొట్టాలి. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి కాబట్టే ఎన్నో సంక్షేమ పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు అని హరీశ్‌రావు అన్నారు.