నెదర్లాండ్‌లో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో కేసులను నిలువరించే ప్రయత్నంలో భాగంగా డచ్ ప్రభుత్వం శనివారం లాక్‌డౌన్‌ను విధించింది. హేగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్‌ రుట్టే ప్రకటించారు. ఈ నిర్ణయంతో నెదర్లాండ్స్‌ మరొకమారు లాక్‌డౌన్‌లోకి వెళ్తుంది.

‘ఊహించిన దానికంటే ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాపిస్తుండడంతో లాక్‌డౌన్‌ తప్పనిసరైంది. కొత్త లాక్‌డౌన్‌ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. కఠిన నిబంధనలతో కూడిన ఈ లాక్‌డైన్‌ కొత్త సంవత్సరం జనవరి 14 వరకు అమల్లో ఉంటుంది. ఐదో వేవ్‌ చేరువ అవుతున్న తరుణంలో లాక్‌డైన్‌ అనివార్యమైంద’ని రుట్టే తెలిపారు.

సూపర్ మార్కెట్లు, వైద్యపరమైన వృత్తులు, కార్ గ్యారేజీలు వంటి ఇతర ముఖ్యమైన షాపులు తప్ప, మిగతా ఇతర షాపులు, అన్ని విద్యా సంస్థలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్‌లు, మ్యూజియంలు, థియేటర్‌లు, జూపార్కులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించింది. శుక్ర, శని వారాల్లో దాదాపుగా 14,742 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

అంతేకాకుండా క్రిస్మస్ తర్వాత నెదర్లాండ్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్రధాన షాపులకు నైట్‌లాక్‌డౌన్‌ అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించారు. అంతేకాకుండా క్రిస్టమస్‌ సెలవులకు ఒక వారం ముందునుంచే పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని ఆదేశించారు.