దేశ్యంలో కాలుష్యం పెరిగిపోతోంది. దేశ రాజధానితో పాటు ఎన్నో పెద్ద పెద్ద నగరాలు ఈ కాలుష్య భూతం కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక రాజధాని దక్షిణ భారత దేశంలోనే పేరెన్నికగన్న ఐటీ నగరం బెంగళూరు కూడా ఈ జాబితాలో టాప్‌లోకి దూసుకుపోతోంది. గ్రీన్‌పీస్ సౌత్ వెస్ట్ ఆసియా అనే సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న కాలుష్య నగరాల 2020 జాబితాలో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. గాలి కాలుష్యం, దాని సంబంధ కారణాలతో గతేడాది బెంగళూరులో దాదాపు 12వేల మంది ప్రజలు మరణించారు. అలాగే రూ.12,365 కోట్ల మేర ఆర్థిక నష్టం కూడా కలిగిందని సదరు నివేదిక వెల్లడించింది.

ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ టాప్‌లో ఉంది. గతేడాది 54వేల మందికి పైగా ప్రజలు గాలి కాలుష్యం కారణంగా ఢిల్లీలో మరణించారు. ఆ తరువాత రెండో స్థానంలో మహారాష్ట్ర రాజధాని ముంబై ఉంది. ముంబైలో గతేడాది 25వేల మంది మరణించారు.

అంతర్జాతీయంగా కూడా

ఇక్కడ మరో దారుణం ఏంటంటే.. అంతర్జాతీయ లెక్కల ప్రకారం గతేడాది అత్యధికంగా కాలుష్యం వల్ల సంభవించిన మరణాల సంఖ్యలో కూడా ఢిల్లీనే టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తరువాత మెక్సికో రాజధాని మెక్సికో సిటీ రెండో స్థానంలో, బ్రెజిల్‌లోని నగరం సావో పాలో మూడో స్థానంలో, చైనాలోని షాంఘై నాలుగో స్థానంలో, జపాన్ రాజధాని టోక్యో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా మొత్తం లక్షా అరవై వేలమంది కాలుష్య వల్ల ప్రాణాలు విడిచారు.