మరికొన్ని గంటల్లో ఇష్టపడి వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో అడుగు పెట్టడానికి ఉత్సాహంగా.. బంధువులతో కలిసి ఊరేగింపుగా వెళుతున్న సమయంలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధు మిత్రులందరూ సంతోషంగా డ్యాన్స్ చేస్తూ వెళుతున్న వేడుకలో మరణ మృదంగం మోగింది. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నవ వధువు పెళ్లి బృందం కల్యాణ మండపానికి సంతోషంగా బయలు దేరారు.. పెళ్లి కూతురు ప్రత్యేకంగా అలంకరించుకుని సన్ గ్లాసెస్ పెట్టుకుని కారులోని రూఫ్ పైన నిలబడి ఉత్సాహంగా స్టెప్స్ వేస్తుంది. ఇక కారు ముందు బంధువులు, మిత్రులు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు.. ఇంతలో అకస్మాత్తుగా ఒక కారు వచ్చి.. వధువు ప్రయాణిస్తున్న కారుని ఢీ కొట్టింది. అంతే క్షణంలో అక్కడి వాతావరణం మారిపోయింది. పెళ్లి సందడి కాస్తా.. రోదనలతో నిండిపోయింది. అప్పటి వరకు ఫుల్‌ జోష్‌తో డాన్స్‌లు చేస్తున్న వారు కాస్త, దూరంగా ఎగిరిపడ్డారు.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.. మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ప్రమాదం నుంచి పెళ్లి కూతురు బయటపడింది. ఈ ఘటనకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.