బడ్జెట్లో ప్రతిపాదించిన మేర ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించాలంటే, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒక దాన్ని ప్రభుత్వం ఎంచుకోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సాధారణ బీమా సంస్థలకు ఇప్పటికే పలుమార్లు మూలధన సాయం చేసిన ప్రభుత్వం, ఈ త్రైమాసికంలోనే మరో విడత రూ.3,000 కోట్లు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఆర్థికాంశాలు మెరుగైనందున, ప్రైవేటు రంగ కంపెనీలు వీటిని చేజిక్కించుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన న్యూ ఇండియా అస్సూరెన్స్లో ప్రభుత్వానికి 85.44 శాతం వాటా ఉండటంతో, ఈ సంస్థను ప్రైవేటీకరించాలని నిర్ణయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని సమాచారం.