విజయవాడ దుర్గ గుడిలో టికెట్లపై అక్రమాలు జరుగుతున్నాయని చాల రోజుల నుండి వినిపిస్తుంది.విజయవాడ దుర్గగుడికి ఇటీవల ఓ భక్తుడు రూ.లక్ష విరాళం ఇస్తానని వచ్చారు. తన వద్ద ఉన్న బ్యాంకు కార్డుతో స్వైపింగ్‌ చేసి డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. కానీ.. ఆలయంలో స్వైపింగ్‌ యంత్రమే లేదని చెప్పడంతో.. అవాక్కయ్యాడు. మరోసారి ఆలయానికి వచ్చినప్పుడు విరాళం ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు.’

నగదు రహిత లావాదేవీలు అన్నిచోట్లా జరుగుతున్నా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మాత్రం అమలుజరగడం లేదు. నేరుగా డబ్బులతోనే ఇక్కడ లావాదేవీలన్నీ నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లోనూ ఫోన్‌పే, గూగుల్‌పే, స్వైపింగ్‌ యంత్రాలను వినియోగిస్తుండగా.. దుర్గగుడిలో ఆ ప్రయత్నాలు జరగడం లేదు. ఎంత ఎక్కువ డబ్బులు చలామణి జరిగితే.. అంతలా తమ జేబులు నింపుకోవచ్చనే పంథా ఆలయంలో కొనసాగుతోంది. భక్తులు చెల్లించే లావాదేవీలు నేరుగా ఆన్‌లైన్‌లో పడేలా చేయగలిగితే.. అమ్మవారి ఆదాయానికి గండిపడకుండా ఆపొచ్ఛు చీరల కౌంటర్ల దగ్గర నుంచి టిక్కెట్ల కొనుగోళ్లు, ప్రసాదాల విక్రయాల వరకు అన్ని లావాదేవీలు నేరుగా డబ్బులు చెల్లించే నిర్వహిస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పిస్తే.. డబ్బులు చెలామణి తగ్గిపోయి.. అక్రమార్కులకు కష్టతరమవుతుంది.

ఏటా కోటిన్నర మందికి పైగా భక్తులు వచ్చే దుర్గగుడిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దుర్గగుడికి వచ్చే భక్తులు చాలామంది నేరుగా బ్యాంకు కార్డుల ద్వారా స్వైపింగ్‌, డిజిటల్‌ పద్ధతిలో చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఆలయంలో కనీసం ఒక్క స్వైపింగ్‌ యంత్రం కూడా లేదు. ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ల వినియోగం లేదు. నాలుగైదేళ్ల కిందట ఆలయంలో స్వైపింగ్‌ యంత్రాలను అందుబాటులో ఉంచారు. అప్పట్లోనే చాలామంది భక్తులు వీటి ద్వారా విరాళాలు, చెల్లింపులు చేసేవారు. కానీ.. తర్వాత ఈవోలు మారడంతో స్వైపింగ్‌ యంత్రాలను పక్కన పెట్టారు. నేరుగా భక్తుల నుంచి డబ్బులు తీసుకోవడం ద్వారానే తమకు లబ్ధి చేకూరుతుందనే దోరణిలో ఇక్కడ దశాబ్దాలుగా పాతుకుపోయిన కొందరు సిబ్బంది ఇచ్చే సలహాల వల్లే వీటిని పక్కన పెట్టారనే విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా డిజిటల్‌ చెల్లింపులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటే ఏటా రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అమ్మవారి గుడిలో లేకపోవడంపై తరచూ భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నాఅధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

రాష్ట్రంలో తిరుపతి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయం దుర్గగుడి. కానీ ఇప్పటికీ ఇక్కడ మాన్యువల్‌ టిక్కెట్లనే దర్శనాలకు ఇస్తున్నారు. రూ.100, రూ.300 టిక్కెట్ల పుస్తకాలను ముద్రించి వాటిని చింపి భక్తులకు ఇస్తున్నారు. తిరుపతి లాంటి ఆలయాల్లో కంప్యూటర్‌లోనే ఆన్‌లైన్‌ టిక్కెట్లను దశాబ్దాలుగా జారీ చేస్తుంటే ఇక్కడ మాత్రం ఇంకా పుస్తకాలను ముద్రిస్తున్నారు. ఓ మూడేళ్ల కిందట కొంతకాలం తిరుపతి మాదిరిగా ఇక్కడా ఆన్‌లైన్‌ టిక్కెట్లను జారీ చేసినా.. తర్వాత వచ్చిన ఈవోలు వాటిని పక్కన పెట్టారు. టిక్కెట్ల పుస్తకాల ముద్రణ వ్యయం దగ్గర నుంచి అమ్మవారి ఆదాయం పక్కదారి పడుతోందనే ఆరోపణలున్నాయి. మాన్యువల్‌ టిక్కెట్లను భక్తులకు ఇవ్వడం, తిరిగి పునర్వినియోగించడం వంటివి చేస్తున్నారు. ఇదే ఆన్‌లైన్‌లో భక్తుడి ఫొటోతో జారీ చేసే టిక్కెట్లను పునర్వినియోగించేందుకు అవకాశం ఉండదు. అందుకే.. కావాలనే సాంకేతికతను వినియోగించకుండా.. ఇప్పటికీ ముద్రించిన టిక్కెట్లనే జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టిక్కెట్లను పునర్వినియోం చేస్తూ దొరికిన వారి వెనుక దుర్గగుడికి చెందిన ఒకరిద్దరు సిబ్బంది హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ల పుస్తకాలను ముద్రించి ఇలాంటివి చేస్తున్నారేమోననే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దుర్గగుడి టిక్కెట్లను పదేళ్ల కిందట ఎలా ముద్రిస్తున్నారో ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నారు. టిక్కెట్లపై కనీసం భద్రతాపరమైన త్రీడీ హోలోగ్రామ్‌లు పెట్టడం, వాటిని స్కానింగ్‌ చేయడం లాంటివి చేస్తే.. అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్ఛు ఇవేవీ చేయకపోవడం వల్లే టిక్కెటను రీసైక్లింగ్‌ చేయడంతో పాటు తాజాగా నకిలీవి ముద్రిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు లోతుగా దృష్టిసారిస్తే.. అనేక అక్రమాలు వెలుగుచూసేందుకు అవకాశం ఉంటుంది. తాజాగా మూడు రోజులుగా దుర్గగుడిలో ఏసీబీ అధికారులు చేస్తున్న శోదాల్లో అనేక లోపాలను గుర్తించినట్టు తెలిసింది.