పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాల మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు గెలిచిన చోట కొందరు ఎన్నికల అధికారులు ఫలితాలు నిలిపేస్తున్నారని.. తర్వాత వైకాపా బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు జిల్లా నందవరం మండలం మిట్టసోమాపురం పంచాయతీలో ప్రతిపక్ష మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచినా ఫలితాల్ని నిలిపేశారని.. తర్వాత రీకౌంటింగ్ లేకుండానే వైకాపా బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని వివరించారు.గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు పంచాయతీలో వైకాపా బలపరిచిన అభ్యర్థి 9 ఓట్ల తేడాతో ఓడిపోవటంతో ఆ ఫలితాన్ని నిలిపేశారన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించి సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.
లేఖలోని ముఖ్యాంశాలు
ఓట్ల లెక్కింపులో అక్రమాలు, అన్యాయాలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ లేవు.ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేపట్టట్లేదు అని, కొంతమంది పోలీసులు, ఎన్నికల విధుల్లోని సిబ్బంది వైకాపా నాయకులతో కుమ్మక్కై అర్ధరాత్రి వరకూ లెక్కిస్తూ.. ఫలితాలు తారుమారు చేసేస్తున్నారు అని, త్వరగా లెక్కింపు పూర్తయితే ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారు. రాత్రి 8 తర్వాత లెక్కింపు పూర్తయితే ఫలితాలు మార్చి వైకాపా మద్దతుదారులకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు అని, ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు తక్కువ ఆధిక్యంతో ఎక్కడైనా గెలిస్తే.. వారిని అక్కడ వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు అని, కొంతమంది పోలీసులు లెక్కింపు కేంద్రాల్లోకి ప్రవేశించి.. ప్రతిపక్ష పార్టీల మద్దతున్న అభ్యర్థుల్ని, వారి ఏజెంట్లను బెదిరిస్తున్నారు అని, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనమర్లపూడిలో ఒకే ఓటు తేడాతో వైకాపా బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై రీకౌంటింగ్ కోరినా చేయలేదు అని, చీకటి పడ్డాక లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్తు ఆపేసి ఫలితాలు తారుమారు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనగమయ్యపాలెంలో వైకాపా బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా ఉండేందుకు విద్యుత్తు సరఫరా ఆపేశారు అని పేర్కొన్నారు.
మైనర్ పంచాయతీల ఫలితాలూ ప్రకటించలేదు
నాలుగో విడతలో 40% మైనర్ పంచాయతీల ఫలితాలు రాత్రి 10 గంటలకూ ప్రకటించలేదని చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మైనర్ పంచాయతీల్లో తక్కువ ఓట్ల కారణంగా వాటి లెక్కింపు త్వరగా పూర్తవుతుందని, కానీ రాత్రి 10 గంటలకూ ఫలితాలు ప్రకటించకపోవడంతో కావాలనే ఆపినట్లు అర్థమవుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు తక్షణమే ఆ ఫలితాలు ప్రకటించేలా చూడాలని కోరారు.