అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణాలు 5లక్షలకు చేరువయ్యాయి. ఆదివారం నాటికి ఆ దేశంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4.98లక్షలు దాటింది. ఈ విషయాన్ని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ నివేదికలు వెల్లడించాయి. అమెరికాలో దాదాపు 102 ఏళ్ల కింద ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి సృష్టించిన విలయ తాండవం తర్వాత అంత భారీ స్థాయిలో సంభవించిన సంక్షోభం ఇదేనని ఆ దేశ అంటు వ్యాధి విభాగం నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు.

యూఎస్‌లో గతేడాది ఫిబ్రవరిలో తొలి కరోనా మరణం సంభవించిన విషయం తెలిసిందే. అప్పడు మొదలైన మరణ తాండవం కేవలం తొలి నాలుగు నెలల్లోనే లక్ష మార్కును దాటింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ నాటికి 2లక్షలు, డిసెంబర్‌ నాటికి 3లక్షల మంది మహమ్మారికి బలయ్యారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే డిసెంబర్‌లో 3లక్షలు ఉన్న మరణాల సంఖ్య జనవరి 19న ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే సమయానికి 4లక్షలకు చేరుకుంది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే లక్ష మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ట్రంప్‌ ప్రభుత్వం వ్యవహరించిన ఉదాసీన వైఖరి స్పష్టమవుతోందని ఆరోగ్య నిపుణులు ఆరోపించారు.

కాగా కొవిడ్‌ కారణంగా దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5లక్షలు చేరుతున్న క్రమంలో శ్వేత సౌధంలో అధ్యక్షుడు బైడెన్‌ ఆధ్వర్యంలో మృతులకు సోమవారం నివాళి అర్పించనున్నారు. కొద్ది సేపు మౌనం పాటించి, కొవ్వొత్తులతో నివాళులు అర్పించనున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 2.80కోట్ల మంది కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 2.5మిలియన్ల మంది మరణించారు.