ఇటీవల కాలంలో కరోనా కేసుల్లో పెరుగుదల చాల ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 6,20,216 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14,199 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దాంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,10,05,850కి చేరింది. అయితే మరణాల సంఖ్య వంద లోపే నమోదుకావడం కాస్త ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 83 మంది మృత్యు ఒడికి చేరుకోగా..మొత్తంగా 1,56,385 మరణాలు సంభవించాయి. 

ఇక, క్రియాశీల కేసులు 1,50,055కి చేరుకోగా..ఆ రేటు 1.32 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి బయటపడిన వారి సంఖ్య సుమారు 1.07 కోట్లుగా ఉండగా..ఆ రేటు 97.25 శాతంగా కొనసాగుతోంది. నిన్న 9,695 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. అయితే కొద్ది రోజులుగా రికవరీ కేసుల కంటే పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దాంతో ఈ మహమ్మారి మరోసారి తీవ్రరూపం దాల్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చర్యలకు దిగాయి. మహారాష్ట్రలో కేసుల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్ నిబంధనలను మరోసారి అమల్లోకి తీసుకువచ్చారు. మహారాష్ట్ర, కేరళలో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. అధిక సంఖ్యలో టెస్టింగ్, ట్రేసింగ్ చేపట్టాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది. 

మరోవైపు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 21నాటికి 1,11,16,854 మంది టీకాలు తీసుకోగా..నిన్న 31,681 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది.