హైదరాబాద్‌ వేదికగా ప్రతి ఏటా నిర్వహించే బయోఏషియా సదస్సుకు ఈ ఏడాది కూడా సర్వం సిద్ధమైంది. ఈసారి ‘మూవ్‌ ద నీడిల్‌’ థీమ్‌తో నిర్వహించనున్న ఈ సదస్సు ఈరోజు (సోమవారం) ప్రారంభమవుతోంది. ఈ సదస్సును మంత్రి కేటీఆర్‌ ఉదయం 11 గంటలకు బేగంపేటలోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో ప్రారంభించనున్నారు.
ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి 30 వేల మంది వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్నారు. ఈ ఏడాది సదస్సులో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ సౌమ్య స్వామినాన్‌ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది బయో ఏషియా సదస్సును వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. 18వ సారి నిర్వహిస్తున్న ఈ సదస్సులో జీవ శాస్త్రాల పరిశోధనల్లో ప్రగతి, ఆరోగ్య పరిరక్షణ, ఔషధరంగం అభివృద్ధి, కరోనా తదనంతర సవాళ్లను ఎదుర్కోవటంలో ఫార్మారంగం పాత్ర తదితర అంశాలపై నిపుణులు చర్చ జరపనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా మలుచుకోవాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రలశాఖ మంత్రి కేటీఆర్‌ సదస్సును ప్రారంభించిన అనంతరం.. భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా, సంయుక్త ఎండీ చిత్రా ఎల్లాకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, బయోఏషియా సీఈవో, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొననున్నారు.