దేశంలో చమురు మార్కెటింగ్‌ సంస్థలు గత కొన్నిరోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వరుసగా పెంచుతూ వస్తున్నాయి. దీంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నానాటికి పెరుగుతున్న పెట్రో ధరల కారణంగా సాధారణ ప్రజల జేబు గుల్ల అవుతుండడంతో నాలుగు రాష్ట్రాలు ఉపశమన చర్యలు తీసుకున్నాయి. తమ వంతుగా వ్యాట్‌తోపాటు ఇతర పన్నులను తగ్గించి ఈ పెట్రో మంట నుంచి వినియోగదారులకు కొంతవరకు ఊరట కల్పించాయి. కాగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎన్నడూ లేనంత స్థాయికి చేరినప్పటికీ కేంద్రం ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.13‌, డీజిల్‌పై రూ.16 ఎక్సైజ్‌ డ్యూటిని పెంచిన విషయం తెలిసిందే. దానిని ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తున్నది. దీంతో దేశంలో నానాటికీ పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

కాగా, రాష్ట్రంలో పెట్రోల్ ధరలు రూ.100కు చేరువవుతుండటంతో రాజస్థాన్‌ ప్రభుత్వం స్పందించింది. దేశంలోనే మొదటిసారిగా జనవరి 29న 38 శాతంగా ఉన్న వ్యాట్‌ను 36 శాతానికి తగ్గించింది. దీంతో వినియోగారులకు కాస్త ఊరట లభించింది. అసోం, మేఘాలయ, తాజాగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు కూడా ఇదే దారిలో పయనించాయి.

అసోం ప్రభుత్వం గతేడాదిలో కొవిడ్‌-19పై పోరాడేందుకు నిధుల సేకరణ కోసం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 ట్యాక్స్‌ విధించింది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో ఆ ట్యాక్స్‌ను ఫిబ్రవరి 12న ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో కొంతమేర ధరలు తగ్గాయి. అదేవిధంగా మేఘాలయ ప్రభుత్వం భారీగా ధరలను తగ్గించింది. పెట్రోల్‌ డీజిల్‌పై రిబేట్‌ రూపంలో రూ.2లను తగ్గించగా, తర్వాత వ్యాట్‌ను పెట్రోల్‌పై 31.62 శాతం నుంచి 20 శాతానికి, డీజిల్‌పై 22.95 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. దీంతో రాష్ట్రంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.40, డీజిల్‌పై రూ.7.10 తగ్గాయి. ఇక, చమురు ధరలను తగ్గించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను రూ.1 మేర తగ్గించింది. దీంతో పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం ధర్మసంకటంలో పడింది.