‌దేశవ్యాప్తంగా ‘బైక్‌ టాక్సీ’ సేవలందిస్తున్న ఆన్‌లైన్‌ సంస్థ రాపిడో తమ వినియోగదారులకు మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వారు వివిధ ప్రాంతాల్లో ఆగి, తమ పనులు ముగించుకునేందుకు వీలుగా ‘మల్టీపాయింట్‌ ట్రిప్‌’ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆ సంస్థ నేడు ప్రకటించింది. తమ సేవలు హైదరాబాద్‌తో సహా దిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, జైపూర్‌లలో అందుబాలులోకి వస్తాయని వివరించింది.

ఈ ప్యాకేజీలు ఒకటి, రెండు, మూడు నాలుగు ఆరు గంటలకు గాను లభిస్తాయిని.. వాహనాన్ని నడిపేందుకు ట్రిప్‌ ముగిసేదాకా ఓ క్యాప్టెన్‌ అందుబాటులో ఉంటాడని సంస్థ వివరించింది. నగరంలోని వివిధ ప్రదేశాల్లో పనులు ఉన్నవారు.. పలు మార్లు బుక్‌ చేసుకోవటం, వాహనం వచ్చే వరకు అన్ని సార్లూ వేచిచూడటం అసౌకర్యంగా ఉంటుందని.. దీనిని నివారించేందుకే తాము ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టామని రాపిడో ప్రకటించింది. ఈ విధానానికి గత కొద్ది నెలలుగా మార్కెట్లో ఆదరణ పెరుగుతోందని, తాము త్వరలోనే ఈ వెసులుబాటును దేశంలోని వందకు పైగా నగరాల్లో విస్తరిస్తామని సంస్థ సహవ్యవస్థాపకుడు అరవింద్‌ శంకా తెలిపారు.