అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ ముందు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. జనసేన నేతలను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పవన్‌ ఆరోపించారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ అది అమలయ్యే అవకాశం కనిపించడం లేదన్నారు.

తమ పార్టీ అభ్యర్థులు తగిన ఆధారాలతో అధికారులను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు తమ కింది స్థాయి అధికారులతో పేరుకే ఫిర్యాదులు తీసుకుని పంపించేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో ఆలోచించడం లేదన్నారు. అధికారుల తీరుతో ఆ ప్రక్రియపై నమ్మకం పోయిందని పేర్కొన్నారు. ఫిర్యాదుల వరకు న్యాయం చేస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఇచ్చిన హామీ అమలయ్యే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదన్నారు.

తాజా నోటిఫికేషన్‌ విడుదల చేస్తే తప్ప న్యాయం జరగదని పవన్‌ అభిప్రాయపడ్డారు. జనసేన లీగల్‌ విభాగంతో కూడా ఈ అంశంపై చర్చించామని.. హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు వెల్లడించారు. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని పవన్‌ కోరారు.