జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories)

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. అయితే, ధరలు ఇలా మండిపోవడానికి గత ప్రభుత్వాల తీరే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇంధన దిగుమతుల విషయమై గత ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు దేశంలోని మధ్య తరగతి ప్రజలు భారం మోయాల్సి వస్తోందని ఆయన అన్నారు.

తమిళనాడులో చమురు, గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన ఓ ఆన్‌లైన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

”భారత్ లాంటి వైవిధ్యం, సమర్థత ఉన్న దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడాలా? నేను ఎవరినీ విమర్శించడం లేదు. కానీ, మనం ఈ అంశంపై దృష్టి పెట్టి ఉంటే, మన మధ్య తరగతి భారాన్ని మోయాల్సిన గతి వచ్చేది కాదు” అని మోదీ అన్నారు.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలను తాకింది. గత కొన్ని రోజులుగా చమురు సంస్థలు ఇంధనం ధరలను పెంచుతూనే ఉన్నాయి.

దేశ రాజధాని దిల్లీలో గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ.89.88, డీజిల్ ధర రూ.80.27గా ఉన్నాయి.

పెరుగుతున్న ఇంధన ధరల విషయమై కాంగ్రెస్ సహా విపక్షాలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘ఇంధనంపై భారీ స్థాయిలో పన్నులు వసూలు చేస్తూ గత ప్రభుత్వాలను నిందిస్తారా?’ అని ప్రశ్నిస్తున్నాయి.

మరోవైపు చమురు మీద ఆధారపడటాన్ని జనం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ విధానం పాటిస్తుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ… ”మోదీ మార్కు ప్రసంగం ఇది. ఆయన చెప్పిందానిలో కొంతవరకూ నిజం ఉంది. కానీ, ఎక్కువ అబద్ధాలే” అని చమురు, గ్యాస్ వ్యవహారాల నిపుణుడు రణ్‌వీర్ నయ్యర్ అభిప్రాయపడ్డారు.

2013 వరకూ పెట్రోల్‌పై కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు దాని అసలు ధరలో 44 శాతం వరకూ ఉండేవని, ఇప్పుడు అవి 100 నుంచి 110 శాతం వరకూ పెరిగాయని ఆయన చెప్పారు.

”మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్ల వరకూ పెరిగింది. కానీ, ఇప్పుడు 60 డాలర్లకే పడిపోయినా, పెట్రోల్ ధర రూ.100ను తాకుతోంది. మరి, గత ప్రభుత్వాలు దీనికి కారణం ఎలా అవుతాయి?” అని ఆయన అన్నారు.

నిజానికి బ్యారెల్ చమురు ధర ఏడాది క్రితం ఇప్పుడున్న ధరలో సగమే ఉంది. అయినా అప్పుడు గానీ, ఇప్పుడు గానీ ఆ మేరకు ఇంధనం ధరలు మాత్రం తగ్గలేదు.

2015 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

”బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్రోల్‌పై ఇంత భారీగా పన్నులు లేవు. బ్రిటన్‌లో 61 శాతం, ఫ్రాన్స్‌లో 59 శాతం, అమెరికాలో 21 శాతం పన్నులు విధిస్తున్నారు” అని నయ్యర్ చెప్పారు.

అయితే, ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం ఇంధనంపై భారీ స్థాయిలో పన్నులు విధిస్తోందని, ఇప్పటి వరకు ఈ పన్నుల ద్వారా రూ. 20 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరాయని నయ్యర్ అన్నారు.

చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రస్తుతం పెట్రోల్‌లో 8.5 శాతం ఇథనాల్ కలుపుతున్నారు. 2025 కల్లా దీన్ని 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇథనాల్‌ను చెరుకు నుంచి తీస్తారు. ఇథనాల్ కలపడాన్ని పెంచితే చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనం అందించవచ్చు.

కారణం ఏంటి?

”ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వానికి డబ్బులు అవసరం. పన్నుల వసూలుకు పెట్రోలియం ఉత్పత్తులపై వడ్డింపులు మంచి మార్గం. ఇంధనంపై అధిక పన్నులు కొనసాగుతాయి” అని పీడబ్ల్యూసీ సంస్థలో చమురు, గ్యాస్ విభాగాలకు హెడ్‌గా ఉన్న దీపక్ మాహుర్కర్ అన్నారు.

”ఇంధన ధరలు పెరిగినా, వినియోగం తగ్గలేదు. అందుకే ప్రభుత్వం ధరలు తగ్గించుకోవాలనుకోవట్లేదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా సంక్షోభం తర్వాత చైనాలో ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతోంది. అక్కడ డిమాండ్ కూడా పెరుగుతోంది. మరోవైపు సౌదీ అరేబియా సహా చమురు ఉత్పత్తి చేసే దేశాల సంఘం (ఓపెక్) ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ కారణాలతో ముడి చమురు ధర కూడా పెరుగుతోంది.

కానీ, భారత్‌లో ఇంధన ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం దేశీయంగా విధిస్తున్న పన్నులేనని నయ్యర్ అన్నారు. 

చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి దేశీయంగా చమురు నిక్షేపాలను గుర్తించడం… చమురు, గ్యాస్ బావులను అభివృద్ధి చేసుకోవడం అవసరం.

”ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతోంది. ఈ సమయంలో దేశంలో కొత్త చమురు నిక్షేపాలను కనిపెట్టేందుకు, చమురు ఉత్పత్తి పెంచేందుకు ఎంతో చేసి ఉండొచ్చు. ఏదైనా చమురు బావిని అభివృద్ధి చేసేందుకు ఆరేడేళ్లు పడుతుందని అంటుంటారు. కానీ, వచ్చే ఐదారేళ్లలో దేశంలో చమురు ఉత్పత్తి పెరిగే అవకాశాలేవీ కనిపించడం లేదు” అని మాహుర్కర్ అన్నారు.

”ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చాలా పనిచేసింది. కానీ, అండర్‌గ్రౌండ్ డేటా, బిజినెస్ కాన్ఫిడెన్స్, పన్నుల విషయంలో ఇంకా స్పష్టత లేదు” అని ఆయన అన్నారు.

మరోవైపు చమురు నిక్షేపాలను వెతికేందుకు గత ప్రభుత్వాలు తగినంత కృషి చేయలేదనడం సరికాదని నయ్యర్ అభిప్రాయపడ్డారు.

”చమురు, గ్యాస్ రంగాల్లో అనేక న్యాయపరమైన వివాదాలున్నాయి. విదేశీ సంస్థలు రెట్రోస్పెక్టివ్ పన్ను విషయమై భయంతో ఉన్నాయి. దీంతో పెట్టుబడి కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి” అని ఆయన అన్నారు.

చమురు, గ్యాస్ రంగాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకపోవడం కూడా సంస్థలు ఈ రంగానికి దూరంగా ఉండటానికి కారణమవుతోందని మాహుర్కర్ అన్నారు.

”అధిక ఇంధన ధరలను మోదీ ప్రభుత్వం ఓ శిక్షలా వాడుకుంటుంది. ఈ విధానం సరైందేనా?” అని నయ్యర్ ఆందోళన వ్యక్తం చేశారు.

”భారత్‌లో పేద, ధనిక అంతరాలు చాలా ఎక్కవగా ఉన్నాయి. ధనికులపై ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఏమీ ఉండదు. కానీ, కడు పేదరికంలో ఉన్నవారిపై, అసలు వాహనాలే లేనివారిపై కూడా దీని ప్రభావం చాలా ఉంటుంది” అని ఆయన అన్నారు.

”మధ్య తరగతి వారిపై, పేదలపై ఇంధన ధరల ప్రభావం చాలా ఉంటుంది. రవాణ ఖర్చులు పెరిగితే, సాధారణ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని అనుసరించడం సరి కాదు. ప్రజలపై ఇంధన ధరల భారం పడకుండా చేసేంత బలంగా దేశంలోని రవాణా రంగం లేదు” అని నయ్యర్ వ్యాఖ్యానించారు.

ఇంధన ధరల ప్రభావం వల్ల సాధారణ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ధరల పెరుగుదల గురించి హెచ్చరించింది.

ఈ ఏడాది జనవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీసీ) రెండు శాతానికి పెరిగింది. డిసెంబర్‌లో ఇది 1.2 శాతంగా ఉంది. మరోవైపు చిల్లర ద్రవ్యోల్భణం జనవరిలో పడిపోయి 4.1 శాతానికి వచ్చింది. అయితే, ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గిస్తారన్న ఆశలైతే కనిపించడం లేదు.

కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు పెరగడం మళ్లీ దేశం మాంద్యం వైపు వెళ్లేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

”గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీని సంస్థలు రుణాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకున్నాయి. అవి కొత్తగా పెట్టుబడులు పెట్టలేదు. ఇంధన ధరలు ఎక్కువగా కావడం వల్ల ప్రతికూల ఫలితాలు రావొచ్చు” అని నయ్యర్ అన్నారు.

పెట్రోలు ధరలు ప్రపంచమంతటా తగ్గుతుంటే ఇక్కడ ఎందుకు పెరుగుతున్నాయి?

‘ప్రభుత్వానికి స్పష్టత లేదు’

ఆర్థిక విధానాలపై ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత ఉన్నట్లు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు.

”ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతోంది. దీని వల్ల ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది. జనం వాహనాలు కొనడం ఆపితే, ఆటోమొబైల్ లాంటి పెద్ద రంగం మాంద్యంలోకి వెళ్తుంది” అని నయ్యర్ అన్నారు.

మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. 2035ని లక్ష్యంగా పెట్టుకుని, ప్రభుత్వం కృషి చేస్తోంది.

”ఎలక్ట్రిక్ వాహనాలను జనం అంగీకరించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. 2050 వరకూ ఈ లక్ష్యాన్ని చేరుకున్నా, పెద్ద విషయమే” అని నయ్యర్ అన్నారు.

ఒకవేళ ఇంధన వినియోగం వల్ల వాయు కాలుష్యం పెరుగుతందని ప్రభుత్వం భావించినా… విద్యుత్ ఉత్పత్తి రంగం కూడా కాలుష్యానికి ప్రధాన కారణమే.

భారత్ చమురుపై ఆధారపడటం తగ్గడానికి మరో 10-15 ఏళ్లు పట్టవచ్చని మాహుర్కర్ అభిప్రాయపడ్డారు.

”ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో వైరుధ్యం కనిపిస్తోంది. సమగ్ర వ్యూహంతో వారు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది” అని నయ్యర్ అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.