దొంగతనం చేసి బస్సులో పారిపోతున్న నిందితులను పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసులు విమానంలో ఛేజ్ చేశారు. దొంగలు ప్రయాణిస్తున్న బస్సుకు ఎదురెళ్లి షాకిచ్చారు.దొంగలను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు మరోసారి తమ ముందుచూపు ప్రదర్శించారు. అరుదైన ఆపరేషన్‌తో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. చోరీ చేసి బస్సెక్కిన దొంగలను ఫ్లైట్‌లో వెళ్లి ఛేజ్ చేశారు. సినీ ఫక్కీలో చేసిన ఈ ఆపరేషన్లో చివరకు విజయం సాధించారు. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వరకు సాగిన ఈ ఆపరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఒక బేకరీలో ఇటీవల దొంగతనం జరిగింది. పక్కా ప్రణాళికతో బేకరీ నుంచి దాదాపు 5 లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. చోరీ జరిగిన విధానం గురించి ఓ అంచానాకు వచ్చిన పోలీసులు అది ఇంటి దొంగల పనేనని అభిప్రాయానికి వచ్చారు. ఆ దిశగా విచారణ ప్రారంభించారు. వెంటనే నాలుగు బృందాలను రంగంలోకి దించారు.

సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు దొంగలను గుర్తించారు. బేకరీలో పని చేస్తున్న వాచ్‌మన్ మరి కొంత మందితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా తెలుసుకున్నారు. వాచ్‌మన్ ఫోన్ నంబర్, అతడి చిరునామా ఆధారంగా విచారణ కొనసాగించారు. అయితే.. కీలక ఆధారాలు సేకరించే వరకే దొంగలు రాష్ట్ర సరిహద్దు దాటిపోయారు.

దొంగల స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ప్రాంతం. వాళ్లు స్వస్థలాలకు వెళ్లే లోగా పట్టుకోవాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు.

కోల్‌కతా బస్సులో ఉన్నారని ఎలా తెలిసింది?
బేకరీలో చోరీ చేసిన సొత్తుతో వాచ్‌మెన్ సహా మరో ముగ్గురు కలిసి తమ సొంత గ్రామానికి బయల్దేరారు. జూబ్లీహిల్స్ నుంచి నేరుగా ఇమ్లీబన్ బస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ విజయవాడకు వెళ్లే బస్సెక్కారు. విజయవాడ నుంచి రోజూ ఉదయం కోల్‌కతాకు ఓ బస్సు బయల్దేరుతుంది. నిందితులందరూ విజయవాడలో ఆ బస్సు ఎక్కారు.

కోఠిలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో బస్సెక్కడానికి ముందే నిందితులు తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. అయితే.. బస్సులో ఎక్కడానికి ముందు చివరిసారిగా వాళ్లు మాట్లాడిన ఫోన్ కాల్ పోలీసులకు కీలకంగా మారింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్లు కోల్‌కతా వెళ్తున్నట్లు గుర్తించారు. పోలీసులు ఈ సమాచారం తెలుసుకునే వరకు మధ్యాహ్నమైంది.

విజయవాడలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన బస్సు సాయంత్రం 9 గంటల లోపు కోల్‌కతా చేరుకుంటుంది. పోలీసులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్లైట్‌లో కోల్‌కతా బయల్దేరారు. సాయంత్రం ఐదున్నర గంటలకు కోల్‌కతా చేరుకున్నారు. అక్కడ ఓ టాక్సీ తీసుకొని బస్సు ఏ రూట్లో వస్తుందో.. దానికి ఎదురుగా బయల్దేరారు.

150 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత పోలీసులకు తాము వెతుకుతున్న బస్సు తారసపడింది. బస్సును అడ్డగించి ఆపేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బస్సులో పోలీసులను చూసి దొంగలు షాక్‌కు గురయ్యారు. వారిని అదే మార్గంలో తిరిగి జూబ్లీహిల్స్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి చోరీ చేసిన నగదు మొత్తాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు.

ఇటీవల సంచలనం సృష్టించిన తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో దొంగతనం కేసులోనూ తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంటల వ్యవధిలో నిందితులను పట్టుకొని వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే.