ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle)

Pregnancy: వారాలు గడిచినా వాంతులు తగ్గట్లేదు, ఎందుకిలా? వాంతుల వల్ల బిడ్డకు హాని ఉంటుందా?

సుచిత్రకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి ఓ వారం అవుతోంది. అప్పటి నుంచీ వాంతులు, వికారం.. ఎవరితోనూ మాట్లాడే మూడ్ లేదు. ఎక్కడలేని నీరసమూ కమ్ముకుంది. 

ఉదయం నుంచీ ఆరుసార్లు వాంతులయ్యాయి. 

తల్లి వచ్చి, గంజిలా కనిపించే సూప్ తెచ్చి “తాగమ్మా” అంది. వువ్వెత్తున రాబోయిన వాంతిని ఆపుకుని అటు తిరిగి పడుకుంది. 

“ఏది మా వదిన? వదినా.. వదినా…” అంటూ కేక వేస్తూ వచ్చింది ఆడపడుచు. బలవంతాన లేచి కూర్చుంది. మేనకోడలో/అల్లుడో పుట్టబోతున్నందుకు ఆమె చాలా సంతోష పడుతూ వచ్చింది. 

“ఏమీ తినకుండా పడుకుందమ్మా. వికారంగా వుందట” అని తల్లి చెప్పింది. 

“అత్తయ్యగారూ! ఇలా ఇవ్వండి. వదినకు నేను తినిపిస్తాను” అంటూ తల్లి దగ్గర సూప్ బౌల్ మళ్లీ తెచ్చింది.

పిల్లాడిని చంకలో వేసుకుని “తిను వదినా, నువ్వు తింటేనే కదా, నా మేనకోడలు పెరిగేది” అంటూ చమత్కారంగా మాట్లాడుతోంది. 

“వద్దు వదినా. వాంతి వచ్చేట్టుంది” అని చెప్పింది. 

ఆమె చంకలో పసి వాడెందుకో ఏడుస్తున్నాడు. పసి వాడి దగ్గర పాల వాసనకు సుచిత్రకు మరింత వికారమైంది. ఆడపడుచుతో మర్యాదగా మాట్లాడేందుక్కూడా ఓపిక లేదు. 

“ఒక్క స్పూన్, జస్ట్ ఒక్క స్పూన్..” అంటూ బలవంత పెడితే, ఆమె బాధపడుతుందని తాగింది. మరు క్షణంలో వాష్ రూమ్ వైపు పరుగు తీసింది. 

“ఏవండీ, మార్కెట్ కెళ్లి నిమ్మకాయలు పట్రండి.” తోడు వచ్చిన భర్తను పురమాయించింది. 

సినీ పరిజ్ఞాన సౌజన్యంతో, ఆవకాయ పెట్టుకోగల పచ్చి మామిడికాయలు సైతం తెచ్చారాయన.

హైపర్ ఎమెసిస్ 

ప్రెగ్నెన్సీ మొదలైన 4 వారాల నుంచి 7 వారాలలోపు వేవిళ్ల లక్షణాలు ప్రారంభమవుతాయి. 20వ వారం వచ్చేసరికి 90 శాతం మహిళల్లో వేవిళ్లు తగ్గుముఖం పడతాయి. 

హైపర్ ఎమెసిస్ – గర్భం దాల్చినపుడు మొదటి మూడునెలలు వికారంగా ఉండడం సహజం. ఒకవేళ తీవ్రస్థాయిలో ఉంటే దానిని హైపర్ ఎమెసిస్ అంటారు. ఈ పరిస్థితి 5 శాతం మంది గర్భిణీలలో కనిపిస్తుంది. 

గర్భిణీలు ఏమీ తినలేకపోవడానికి కారణం వాంతి వస్తుందన్న భయం. తాగడానికి, తినడానికి భయపడుతుంటారు. వేవిళ్ల వల్ల ఉద్యోగం చేసే స్త్రీలు సమర్థవంతంగా పని చేయలేరు. ఏమీ తినకపోవడం వల్ల నీరసం కలుగుతుంది. ఆ ప్రభావం మూడ్ మీద ఉంటుంది. డిప్రెషన్‌కు గురవుతారు. 

ఈ వాంతుల తీవ్రతను అంచనా వేయడానికి ఒక స్కోరింగ్ పద్ధతి ఉంది. గర్భిణీలో కనిపించే లక్షణాలు, శారీరిక పరీక్షా ఫలితాలు, మూత్ర, రక్త పరీక్షా ఫలితాలను క్రోడీకరించి స్కోరింగ్ వేస్తారు. 

దాన్ని Pregnancy-Unique Quantification of Emesis (PUQE) score అంటారు.

వాంతుల వల్ల బిడ్డకు హాని ఉందా? 

ఈ వాంతుల వల్ల బిడ్డకు కలిగే నష్టం పెద్దగా ఉండదు. నిజానికి వాంతులు ఎక్కువగా వస్తే, అబార్షన్ అయ్యే అవకాశం తక్కువ. ప్రెగ్నెన్సీ చక్కగా కొనసాగుతుందన్న దానికి అది ఒక సూచన. 

కొంతమంది స్త్రీలలో ఈ వాంతులు ఎక్కువ కాలం కొనసాగుతాయి. వారికి పుట్టే బిడ్డ బరువు తక్కువగా ఉండే అవకాశముంటుంది. 

ఈ వాంతుల నుంచి ఉపశమనం ఎలా? 

ఆహారం తక్కువ పరిమాణంలో, తరచుగా తీసుకోవడం ద్వారా వాంతులు కాకుండా నివారించవచ్చు. 

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వు పదార్థాలు తక్కువగా వుండే ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు: అన్నం, పాస్తా, ఆలు గడ్డలు.

కొన్ని వాసనలు, ఆహార పదార్థాలు వికారం కలిగిస్తాయి. వాటి నుంచి దూరంగా వుండాలి. 

అల్లం: 

గృహవైద్యంలో ముఖ్యమైనది. వికారం తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది. 

అల్లంతో కూడిన ఆహారం, లేదా ద్రవ పదార్థాలు తీసుకుంటే, వాంతులు తగ్గుతాయి.

ఆక్యుప్రెజర్: 

ఇది గర్భిణీలలో వికారం తగ్గించడానికి సురక్షితమైన పద్ధతి.

సముద్రంపై సుదీర్ఘ ప్రయాణాలు చేసే నావికులు సీ- సిక్నెస్ రాకుండా ఒక బ్యాండ్ కట్టుకుంటారు. 

ముంజేయి లోపలి వైపు, మణికట్టు నుంచి 2.5 వేళ్ల దూరంలో ఉండే PC6 పాయింట్ వద్ద వత్తిడి కలిగించడం ద్వారా వాంతులను అరికట్టవచ్చు. 

సాధారణమైన వికారం కన్నా మించి వాంతులవుతుంటే స్కానింగ్ చేయించడం అవసరం. ఎందుకంటే, గర్భంలో కవలలున్నా, లేదా ముత్యాల గర్భిణి అయినా వాంతులు ఎక్కువ అవుతుంటాయి. 

హైపర్ ఎమెసిస్ (Hyper Emesis) – గర్భం దాల్చినపుడు మొదటి మూడునెలలు వికారంగా వుండడం సహజం. ఒకవేళ తీవ్రస్థాయిలో వుంటే దానిని హైపర్ ఎమెసిస్ అంటారు. ఈ పరిస్థితి 5 శాతం గర్భిణిలలో కనిపిస్తుంది. క్రమంగా బరువు తగ్గుతారు. నీరు తీసుకోలేకపోవడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. 

దీర్ఘ కాలం పాటు వాంతులు కొనసాగుతుంటే హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించాలి. వాంతులు తగ్గేందుకు ఇంజెక్షన్లు, డీహైడ్రేషన్ సరిచేసేందుకు సెలైన్ ఎక్కించాల్సి వుంటుంది. సాధారణంగా 3-4 రోజుల పాటు హాస్పిటల్ వైద్యంతో పరిస్థితి చక్కబడుతుంది.

హాస్పిటల్లో చేరాల్సిన అవరసమెప్పుడు వస్తుంది?

1. నిరంతరంగా వాంతులవుతూ, నోటి మాత్రల వల్ల ఏ గుణమూ కనపడకపోవడం.

2. మూత్రంలో కీటోన్ల స్థాయి పెరగడం

3. ప్రస్తుత బరువులో 5 శాతం తగ్గిపోవడం 

రోజూ శరీరంలో యూరియా సోడియం పొటాషియంల స్థాయి చూసుకుంటూ ఉండాలి. విటమిన్ B6 (Thiamine) ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. 

సాధారణమైన వాంతులకు సైక్లిజిన్, పెరినార్మ్ వంటి మందులతో తగ్గించవచ్చు. 

వాంతులు ఎక్కువగా ఉన్నపుడు Ondansetran (జాఫ్రాన్) బాగా పని చేస్తుంది. 

సాధారణమైన చికిత్సకు, మందులకు లొంగనపుడు ఆఖరి ప్రయత్నంగా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తారు. 

స్టెరాయిడ్స్ వల్ల త్వరగా వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

కొన్నిసార్లు వాంతులను తగ్గించడంలో మందులేవీ పని చెయ్యవు. అటువంటి పరిస్థితులలో కడుపులోపలికి ఒక ట్యూబు ద్వారా ఆహారం పంపించవలసి ఉంటుంది. ఈ రకమైన ట్రీట్మెంట్‌లో కొన్ని చిక్కులు ఎదురయే అవకాశం ఉంది. కడుపులో అమర్చిన ట్యూబు పక్కకు జరిగిపోవడం, ఫిస్ట్యులా ఏర్పడడం, పొట్టలోపల చీము చేరడం వంటివి.

టోటల్ పేరెంటెరల్ న్యూట్రిషన్

అన్ని రకాల వైద్యం విఫలమైనపుడు, నోటితో ఆహారం తీసుకోలేని వారికి చివరి ప్రయత్నంగా వాడేది టోటల్ పేరెంటెరల్ న్యూట్రిషన్. 

శరీరానికి అవసరమయ్యే కేలొరీలను, ఇతర పోషకాలను సెంట్రల్ వైన్ ద్వారా ఎక్కించడం. ఇది ఖర్చుతో కూడుకున్న చికిత్స. రిస్క్ కూడా ఎక్కువే. రక్తం గడ్డ కట్టడం, ఇన్ఫెక్షన్, ఎలక్ట్రొలైట్ హెచ్చుతగ్గులు వంటి చిక్కులు ఎదురవుతాయి. 

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌‌తో ఐవీఎఫ్ పద్ధతిలో మెరుగైన సంతానోత్పత్తి

అరుదైన కేసు

సువర్ణ ఒక జూనియర్ కాలేజిలో జువాలజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. అప్పటికే ఆమెకో బాబు ఉన్నాడు. ఒక్క బిడ్డ చాలనుకుంది కానీ, కుటుంబ సభ్యుల ఒత్తిడితో రెండో సారి గర్భం దాల్చింది. 

ప్రెగ్నెన్సీ టెస్ట్ అయినప్పటి నుంచీ ఒకటే వాంతులు. బెడ్ దిగలేకపోయేది.

ఇంట్లో ఉన్న చిన్న బిడ్డను చూసుకునే ఓపిక కూడా లేదు. బిడ్డ వాసన పడేది కాదు. దగ్గరకు తీసుకుంటే వాంతులు. 

తల్లి ముద్దు చేయడం లేదని ఏడిచేవాడు. ఏ రకమైన వైద్యానికీ వాంతులు తగ్గడం లేదు. మూడు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టింది. తర్వాత కూడా వెళ్లలేక సెలవు పొడిగించుకోవాలనుకుంది. ఉద్యోగం తీసేస్తామన్నారు. 

వాంతులు చేసుకునీ, చేసుకునీ జీర్ణాశయపు గోడలలో చీలికలు ఏర్పడ్డాయి. రక్తం పడుతుండేది.

వంట్లో బలమంతా పోయింది. కొవ్వు కరిగిపోయింది. అస్థిపంజరంలా మంచానికతుక్కుపోయింది. ఆమెను చూసుకోవడానికి తల్లి వచ్చింది. మంచంలో చిన్న పక్షిలా, ఎముకలు, తోలు మాత్రమే మిగిలిన అర్భకపు అస్థిపంజరంలా ఉన్న తన కూతుర్ని చూసి ఏడ్చింది. 

అన్ని రకాల వైద్యాలూ విఫలమయ్యాయి. తరచూ ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లేది.

ఇంట్లో వున్న బిడ్డని కోసం, తను ఆరోగ్యంగా ఉండాలనుకుంది. 

గర్భం తీసేయించుకోవాలన్న నిర్ణయానికొచ్చింది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నారంటోంది.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.