తెలంగాణలోని ఓ విద్యార్థిని గాయపర్చిన ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి వినియోగదారుల సేవా కేంద్రం భారీ జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధిత విద్యార్థికి అందేలా చర్యలు తీసుకుంది. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కృపాకర్‌ను గతేడాది మార్చి 3న హాస్టల్‌ వార్డెన్‌ దండించాడు. కర్రతో కొట్టగా విద్యార్థి కుడి కన్నుకు తీవ్ర గాయమై చూపుకోల్పోయాడు. బాధిత విద్యార్థి తండ్రిపాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఆశ్రయించారు. పాఠశాల యాజమాన్యాన్ని, బాధిత విద్యార్థిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చిన సేవా కేంద్రం అధికారులు నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన రూ.11.50లక్షల చెక్కును విద్యార్థి కృపాకర్‌కు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అందజేశారు.