ఆస్ట్రేలియా బిగ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) వేలం పాటలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, గతవారం చెన్నైలో జరిగిన వేలంలో అతడిని దక్కించుకోవడానికి ముందే ఆ జట్టు కచ్చితమైన ప్రణాళికతో ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఆర్సీబీ బోల్డ్‌ డైరీస్‌ పేరిట సోమవారం ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. అందులో ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌ హెసన్‌ మాట్లాడుతూ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి తమకు ఎదురయ్యే పోటీని ముందే పసిగట్టారు.

మిడిల్‌ ఆర్డర్‌లో మాక్సీ ఎంత ప్రమాదకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. 10-15 ఓవర్ల మధ్య అతడు బ్యాట్‌తో బౌండరీల మోత మోగించడమే కాకుండా బంతితోనూ జట్టుకు ఉపయోగపడతాడని హెసన్‌ పేర్కొన్నారు. టాప్‌ ఆరుగురు ఆటగాళ్లలో ఇలాంటి ఆటగాడు ఒకరు అవసరమని చెప్పారు. అయితే, వేలంలో మాక్సీని చేజిక్కించుకునే విషయంలో చెన్నై నుంచి గట్టి పోటీ ఉంటుందని ఆర్సీబీ డైరెక్టర్‌ అభిప్రాయపడ్డారు. అతడు ఊహించినట్లే వేలం పాటలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మాక్సీ ధర రూ.4 కోట్లు దాటగానే రెండు ఫ్రాంఛైజీలు అతడిని దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి అతడి ధర రూ.14 కోట్లకు మించడంతో చెన్నై వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ రూ.14.25 కోట్లకు మాక్స్‌వెల్‌ను సొంతం చేసుకుంది.

కాగా, మాక్స్‌వెల్‌ చాలాకాలంగా ఐపీఎల్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతడు ముంబయి, దిల్లీ, పంజాబ్‌ జట్ల తరఫున ఇదివరకు ఆడాడు. ఇక 2020 సీజన్‌కు పంజాబ్‌ అతడిని రూ.10.75 కోట్ల అత్యధిక ధరకు కొనుగోలు చేయగా తీవ్రంగా నిరాశపరిచారు. యూఏఈలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో 12 మ్యాచ్‌లాడి కేవలం 108 పరుగులే చేశారు.బిగ్‌ హిట్టర్‌గా పేరున్న అతడు ఆ టోర్నీలో ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోయారు. దాంతో పంజాబ్‌ జట్టు ఈసారి వేలానికి ముందే అతడిని వదిలేసుకుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ.. చెన్నైతో పోటీపడి మరీ చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే సీజన్‌లో ఆ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఎలా ఆడతాడో వేచి చూడాలి.