కాలిఫోర్నియాలోని నాసా మిషన్‌ కంట్రోల్‌రూమ్‌ … భరించరాని ఉత్కంఠ అందరిలోనూ! గుండుసూది పడినా వినపడేంత నిశబ్ధం అలుముకుందక్కడ.. ఆ నిశబ్ధాన్ని, ఉత్కంఠను ఛేదిస్తూ ‘నేలను_తాకింది’ అని ఆమె ఉద్వేగభరితంగా అన్న మాటలు అక్కడున్న శాస్త్రవేత్తల్లో పట్టరాని సంతోషాన్ని నింపాయి. ఆమె మాటలే కాదు… ఆమె నుదుటన భారతీయతను ప్రతిబింబించేలా ఉన్న గుండ్రని బొట్టు కూడా ఈ రోజు ప్రపంచాన్ని ఆకర్షించింది.. అంగారక గ్రహంపైకి చేరిన పర్సీవరెన్స్‌ రోవర్‌కి ల్యాండింగ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న స్వాతీమోహన్‌ సాధించిన విజయం ఏంటో తెలుసుకుందాం..

ఏడాది పసిపిల్లగా ఉన్నప్పుడు స్వాతి ఈ దేశాన్ని వదిలి కుటుంబంతో సహా అమెరికాలో అడుగుపెట్టారు. వెళ్తూవెళ్తూ ఆ కుటుంబం ఈ దేశం కట్టూబొట్టుని, సంస్కృతిని తీసుకెళ్లడం మర్చిపోలేదు. బెంగళూరులో పుట్టిన స్వాతి… పెరిగిందంతా నార్తర్న్‌ వర్జీనియాలోనే. చిన్నప్పటి నుంచి పిల్లల డాక్టరు కావాలని కలలుకన్నారామె! కానీ తొమ్మిదేళ్లప్పుడు ఆమె చూసిన ‘ స్టార్‌_ట్రెక్‌’ సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిసోడ్‌లు తనని ఎంతగా ప్రభావితం చేశాయంటే కొత్త కెరీర్‌వైపు ఆమె దృష్టిని మళ్లించాయి. విశ్వంలో సరికొత్త ఆవిష్కరణలు చేయడమే తన లక్ష్యంగా మార్చుకున్నారు స్వాతి.
పదహారేళ్ల వరకూ ‘అమ్మో సైన్సా’ అని భయపడిన స్వాతి మొదటి సారి ఫిజిక్స్‌ క్లాసు విన్న తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కారణం తన సైన్స్‌ టీచర్‌. ఆ టీచర్‌ ఆమెలో భయాన్ని తరిమేశారు. ఇక అక్కడ నుంచి ఆమె శాస్త్రవేత్త అవ్వాలనే తన ఆలోచన సరైనదేనా అని ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఎమ్‌ఐటీ నుంచి ఏరోనాటిక్స్‌లో పీహెచ్‌డీని పూర్తిచేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పసడేనాలో ఉన్న జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు..

అందమైన అరుణగ్రహం… శాస్త్రవేత్తలకు ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంది. తనలోని మార్మికతను వెతకమన్నట్టుగా పరిశోధకులకు ఆహ్వానం పలుకుతూనే ఉంది. ఆ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం మొదలైంది నాసా ఆధ్వర్యంలోని ప్రతిష్ఠాత్మక మార్స్‌_2020 ప్రాజెక్టు. అంతకు ముందు శనిగ్రహంపైకి పంపిన కెశీని.. చందమామపైకి పంపిన గ్రెయిల్‌ ప్రాజెక్టుల్లో కీలకపాత్ర వహించి తనని తాను నిరూపించుకున్న స్వాతికి ఈ ప్రాజెక్టుల్లో మరిన్ని బాధ్యతలని అప్పగించింది నాసా.
ఆ సంస్థ పంపించే పర్సీవరెన్స్‌రోవర్‌ లక్ష్యం అంగారక గ్రహంపై ఉన్న జెజిరో క్రాటర్‌గా పిలిచే ప్రాంతాన్ని చేరుకోవడం. అక్కడకే ఎందుకూ అంటే… ఒకప్పుడు నీటితో నిండినదిగా భావిస్తున్న ఈ డెల్టా ప్రాంతంలో పరిశోధనలు చేస్తే అక్కడి ప్రాణికోటి సంచారం గురించిన సమాచారం తెలియొచ్చనేది శాస్త్రవేత్తల గట్టి నమ్మకం. కానీ అక్కడి వరకూ ఓ రోవర్‌ని పంపించడం అంటే మాటలు కాదు. కోటానుకోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడకు చేరుకున్న తర్వాత అంగారక గ్రహంపై రోవర్‌ ల్యాండ్‌ అవ్వడంలోనే అసలు సవాల్‌ దాగి ఉంది. ఆ ల్యాడింగ్‌ కంట్రోల్‌ వ్యవస్థ బాధ్యతలను స్వాతి తీసుకున్నారు. మార్స్‌ 2020 గైడెన్స్‌, నావిగేషన్‌, కంట్రోల్‌ ఆపరేషన్స్‌ వంటివి ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ మిషన్‌లో భాగమైన జీఎన్‌సీ టీమ్‌ని సైతం ఆమె ముందుండీ నడిపిస్తున్నారు….

ఈ ప్రాజెక్టును 2013లో ప్రారంభించాం. ఎనిమిదేళ్ల కష్టం మాది. ఏడు నెలల క్రితం రోవర్‌ అంతరిక్షంలో ప్రయాణం మొదలుపెట్టినప్పట్నుంచీ మాకు సవాల్‌ మొదలైంది. గురువారం రాత్రి మా ప్రయోగం ఫలితాలు అందే సమయం. ల్యాండ్‌ అవ్వడానికి ముందు మేం పడిన టెన్షన్‌ మాటల్లో చెప్పలేనిది. గత ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో శాస్త్రవేత్తలందరినీ ఇళ్లకు వెళ్లిపొమ్మన్నారు. మాకా సమయం చాలా కీలకమైంది. అందుకే నేను ఇంటి నుంచీ పనిచేసేదాన్ని. క్షణం కూడా వృథా చేయలేదు. నా కష్టం ఫలించింది. ఈ రోవర్‌ తీసుకొచ్చే మట్టిపై చేసే పరిశోధనలు మనకెంతో ఉపయోగపడతాయి’ అనే స్వాతికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భారతీయ కట్టూ, బొట్టుకు విలువనిచ్చే స్వాతి తన శిరోజాలని ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. బొట్టుకు విలువనిచ్చే స్వాతిని ప్రపంచంలోని భారతీయులంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.