తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సంగమ క్షేత్రంలో లక్ష్మీ నృసింహ స్వామి కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి కల్యాణానికి గడియలు సమీపిస్తుండటంతో వేలాది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దీంతో అంతర్వేదిలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. భక్తులు సముద్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి తరలి వెళ్తున్నారు.


నేడు స్వామివారి కల్యాణాన్ని పురస్కరించుకొని ఉదయం అర్చకులు, వేద పండితులు నిత్యార్చనలు చేపట్టారు. రాత్రి 11:18 గడియలకు కల్యాణం జరగనుండగా.. వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంపై స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించారు. రాత్రి పంచగరుడ వాహనంపై లక్ష్మీ నృసింహుడు కనువిందు చేయనున్నారు. మరోవైపు నూతనంగా నిర్మించిన రథంపై రేపు మధ్యాహ్నం 2.35 గంటలకు స్మామివారి రథోత్సవం జరగనుంది.