ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అతి వేగం ప్రమాదకరం అని ఎంతగా ప్రకటనలు గుప్పిస్తున్నా కొంతమంది వారు అప్రమత్తంగా ఉండకపోవడమే కాక ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారు.ఒక పాదచారుడి నిర్లక్ష్యం మరియు ఒక ద్విచక్ర వాహనదారుడి అతివేగం రోడ్డు ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్‌ చింతల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చింతల్‌కు చెందిన శివసాయిగౌడ్‌ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా బాలానగర్‌ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో చింతల్‌ బస్టాప్‌ వద్ద శంకరయ్య అనే వ్యక్తి రోడ్డుపై వాహనాలను గమనించకుండా డబ్బులు లెక్కపెట్టుకుంటూ రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్డు దాటేందుకు పరిగెత్తారు. గమనించని ద్విచక్ర వాహనదారుడు పాదచారుడిని ఢీ కొట్టి గాల్లో ఎగిరి అవతలివైపు ఉన్న రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న వ్యక్తి శివసాయి గౌడ్‌ను గమనించి వాహనం అతనిపై వెళ్లకుండా వెంటనే బ్రేక్‌ వేశారు. ఈ ఘటనలో శంకరయ్యకు స్వల్ప గాయాలవ్వగా.. హెల్మెట్‌ లేకపోవడంతో శివసాయి గౌడ్‌ తల పగిలింది. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివసాయిగౌడ్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీలో నమోదయ్యాయి