దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరల పెరుగుదలకు గల కారణాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ఉత్పత్తి తగ్గిందని తెలిపారు. కొవిడ్‌ నుంచి క్రమంగా కోలుకుంటుండడంతో చమురుకు గిరాకీ పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని అదునుగా భావించిన చమురు ఉత్పత్తి దేశాలు లాభాలను దండుకోవడానికే ఇంధన ఉత్పత్తిని తగ్గించాయని కేంద్రమంత్రి తెలిపారు. దీంతో భారత్‌ వంటి ఇంధన వినిమయ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. చమురు ఉత్పత్తిని తగ్గించొద్దని పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం(ఒపెక్), ఒపెక్ ప్లస్ దేశాలను కోరినట్లు తెలిపారు.

మరోవైపు ధరల పెరుగుదలకు కొవిడ్-19 కూడా ఓ కారణమని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ చేస్తున్న ఖర్చు కూడా ధరలపై ప్రభావం చూపుతోందన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆదాయం సమకూర్చుకునే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంధన ధరలపై ఆధారపడుతున్నాయని వివరించారు. అయితే, ధరల పెంపులో సమతుల్యత ఉండాలన్నారు. దీనికోసం కేంద్ర ఆర్థిక శాఖ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌-19 ప్రభావం నుంచి యావత్‌ ప్రపంచం క్రమంగా బయటపడుతున్న నేపథ్యంలో 2020 నవంబరు నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల నుంచి బ్రెంట్ ఆయిల్ రేటు 60 డాలర్లకు పైనే కొనసాగుతోంది.

వరుసగా 12 రోజుల పాటు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో గత రెండు రోజులుగా ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.58గా.. డీజిల్‌ ధర రూ.80.97గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రూ.94.18, రూ.88.31గా ఉన్నాయి.