భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి వాట్సాప్‌ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రైవసీ విషయంలో వాట్సాప్‌ అనుసరిస్తున్న విధానాలను తెలియజేస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తామని తెలిపింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం వాట్సాప్‌ క్లిక్‌ చేయగానే ఓ బ్యానర్‌ దర్శనమిచ్చింది. దానిని క్లిక్‌ చేస్తే అందులో రెండు పేజీల సమాచారం ఉంది. అందులో వాట్సాప్‌ తన కొత్త గోప్యతా విధానం గురించి మరోసారి వివరించింది. 

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉండటం వల్ల మీ వ్యక్తిగత సంభాషణలు, మాటలను మేం వినలేం. బిజినెస్‌ ఛాట్స్‌ చేసే సమయంలో సులభంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తాం. అయితే అది వినియోగదారుల సమ్మతితోనే’’ అంటూ ఓ ఒక బ్యానర్‌లో రాసుకొచ్చింది వాట్సాప్‌.  మరో పేజీలో ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ ఎలా కలసి పని చేస్తుందనే వివరాలను అందించింది. వినియోగదారులను డేటా, అకౌంట్‌ రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను కూడా అందులో పొందుపరిచింది. ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత ప్రైవసీలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఈ బ్యానర్స్‌లో ప్రదర్శించింది. అయితే ఈ బ్యానర్స్‌ కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందరి వాట్సాప్‌ యాప్‌లోనూ  ఈ బ్యానర్స్‌ కనిపిస్తాయి