అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం పరిసర ప్రాంతాల్లో 4000 సంవత్సరాల క్రితంనాటి శాతవాహనుల కాలానికి చెందిన చారిత్రక పూర్వయుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని మాజీ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి సమాచారం ఇచ్చారు. స్థానిక పోతుగుండు సమీపంలో కొత్తరాతియుగపు విసురుడు రాళ్ల గుంటలు, క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటి నివాసస్థలాల గుంటలు, ఆది యుగపు ముడి ఇనుము, చిట్టెపురాళ్లు, నలుపు, ఎరుపు మట్టి పాత్రలు ఉన్నాయి. వీటితోపాటు శాతవాహనుల కాలానికి చెందిన కుండ పెంకులు, పూసలు, ఇటుక రాతిముక్కలు లభించాయని పురావస్తుశాఖ అనంతపురం కార్యాలయం సహాయ సంచాలకులు రజిత తెలిపారు. బాణిగౌరమ్మ ఆలయం, మునీశ్వరస్వామి దేవాలయం వద్ద క్రీస్తుశకం 8వ శతాబ్దం నాటి మహిష మర్దిని విగ్రహం, క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటి సూర్యవిగ్రహం, రంగస్వామి బండమీద కొత్తరాతియుగపు నూరుడు గుంటలు గుర్తించామన్నారు.