2018 ఏప్రిల్‌ 13 ఇంటి ముందు ఆడుకుంటున్న గణేష్ అనే మూడేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. మూడేళ్లుగా ఆ తల్లిదండ్రులు వెతకని చోటులేదు, ఎక్కని గడపలేదు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించినా చిన్నారి ఆచూకీ తెలియలేదు.
2021 మార్చి 20 మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లోని ఓ ఇంట్లో తమ పిల్లాడు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసుల సాయంతో ఆగమేఘాలపై వెళ్ళగా ఓ దంపతుల వద్ద తమ కొడుకు కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆరేళ్ల కొడుకును చూసుకొని మూడేళ్ల క్షోభను మరిచిపోయారు.

అసలు ఆరోజు ఏమైందంటే….
షేక్‌ నజీర్‌ పేయింటర్‌గా పని చేస్తుండేవాడు, అతడి భార్య యాస్మిన్‌ జిల్లా కేంద్రంలోని పలువురి ఇళ్లలో పనిమనిషిగా చేసేది. ఆమెతో పాటు పని చేసే షబానాబేగంతో స్నేహం ఏర్పడింది. పిల్లలను అపహరించి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని పథకం వేసి నజీర్‌కు చెప్పడంతో ముగ్గురూ కలిసి జిల్లా కేంద్రంలో ముగ్గురు పిల్లలను అపహరించారు. వారిలో ఈ బాలుడు కూడా ఉన్నాడు. సమర్థ గణేశ్‌ మూడేళ్ల క్రితం ఇంటి ఎదుట ఆడుకుంటుండగా షేక్‌ నజీర్‌, యాస్మిన్‌ అలియాస్‌ వసీర్‌బేగం వారి స్నేహితురాలు షబానా కలిసి అపహరించారు. అనంతరం హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో మహ్మద్‌ యూసుఫ్‌అలీ- జైబున్నీసా దంపతులకు రూ.1.70 లక్షలకు అమ్మేశారు.మిగిలిన ఇద్దరినీ కూడా వేరు వేరు చోట అమ్మేసారు. మూడేళ్ల క్రితం అపహరణకు గురైన గణేశ్‌ ఆచూకీ శనివారం రాత్రి ఎలా లభ్యమైందంటే చిన్నకసాబ్‌గల్లీలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. వారిని పట్టుకొని విచారించగా తమ కిడ్నాపుల చిట్టా విప్పినట్లు చెబుతున్నారు. అయితే షేక్‌ నజీర్‌, యాస్మిన్‌ మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో నజీరే బాలుడి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.