అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

ఇక ఇండియా నుంచి అమెరికా వెళ్లొచ్చు..ఎప్పటి నుంచి?

కరోనా కారణంగా గతేడాది అంతర్జాతీయ ప్రయాణాలపై నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించగా ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ సైతం ఈ ఆంక్షలను యథావిధిగా కొనసాగించారు. అటు కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్‌పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది అగ్రరాజ్యం. అయితే ప్రస్తుతం మనదేశంలో కోవిడ్ అదుపులోకి వస్తుండటంతో పలు దేశాలు ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ, బ్రిటన్‌లు భారతీయులను తమ దేశం రావడానికి అనుమతించగా ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా భారతదేశంపై వున్న ఆంక్షలను సడలించింది. అలాగే వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా దేశాల పౌరులను దేశంలోకి అనుమతించాలని జోబైడెన్ నిర్ణయించారు. అమెరికా ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ రిపోర్ట్‌ కలిగి ఉండాలని వెల్లడించింది. వ్యాక్సిన్ వేయించుకుని, కరోనా నెగిటివ్ రిపోర్ట్ వున్న వారు అమెరికాలో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.

రెండు డోసుల టీకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా అయితే ఒక డోసు వేయించుకున్నవారు నవంబరు నుంచి అమెరికాలోకి రావొచ్చని అగ్రరాజ్యం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, చైనాల విషయంలో చిన్న గందరగోళం నెలకొంది. మన దేశంలో భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌కు చైనాలో అభివృద్ధి చేసిన టీకాలకు అమెరికా సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు లేవు. దీంతో ఈ రెండు దేశాల్లో టీకాలు వేయించుకున్నవారిని అనుమతించాలా వద్దా అనే విషయంపై అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాకపోతే నవంబర్ వరకు సమయం వుండటంతో దౌత్య పరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం వుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •