కర్ణాటక లోని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లు 2021ని సోమవారం ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లును అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్నారు. కర్ణాటకలో మతమార్పిడి నిరోధక బిల్లు ఉత్తర్ ప్రదేశ్‌ మతమార్పిడి చట్టం ఆధారంగా రూపొందించారు. ఈ చట్టం మత మార్పిడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తుంది. బలవంతపు మతమార్పిడి చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష జరిమానాను విధించనున్నట్టు చట్టంలో పేర్కొన్నారు. కర్ణాటకకు చెందిన లా కమిషన్ ఈ అంశంపై వివిధ చట్టాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించి నివేదికను అందించింది. పరిస్థితుల ఆధారంగా చట్టం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టినట్టు పేర్కొంది. ముఖ్యంగా పేదలను ప్రలోభపెట్టడం ద్వారా మారుస్తున్నారని సీనియర్ మంత్రులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బిల్లులో పలు అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు.

కర్నాటక ప్రభుత్వం మతమార్పిడి నిరోధక బిల్లు – కర్నాటక మత స్వేచ్ఛా హక్కు బిల్లు, 2021 – శాసనసభలో మంగళవారం ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ బిల్లు ముసాయిదాకు డిసెంబర్ 20, 2021న కేబినెట్ (Cabinet) ఆమోదం తెలిపింది. బిల్లు బలవంతంగా లేదా ప్రేరేపిత మార్పిడి చేసిన వారి కోసం కఠినమైన నిబంధనలతో రూపొందించారు. ఈ బిల్లు “తప్పుడు, బలవంతం, మోసం, మితిమీరిన ప్రభావం, బలవంతం, ఆకర్షణ లేదా వివాహం” ద్వారా ఒక మతం నుంచి మరొక మతంలోకి మారడాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. బాధిత వ్యక్తి, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి లేదా రక్తం, వివాహం లేదా దత్తతకు సంబంధించిన ఇతర వ్యక్తులు ఎవరైనా అలాంటి చర్యకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేయవచ్చని పేర్కొంది. రుజువైన వారికి జైలు, జరిమానాను విధించేలా చట్టం రూపొందించారు. తమకు తామే మార్చుకుని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అటువంటి మార్పిడులను పట్టించుకోవలసిన ఆవశ్యకత లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బలవంతపు, మోసపూరిత మార్పిడిలపై మాత్రమే కఠినంగా వ్యవహరించవలసిందిగా సూచించారు.