ముంబై: కుటుంబ సభ్యులకు తెలియకుండా గోవా ట్రిప్‌కు వెళ్లిన ఓ యువతి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడింది. ముంబైకి చెందిన అంబర్ సయ్యద్ అనే యువతి(28) గత మూడేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. కాగా..ఈ ఏడాది ఓ  ఫ్రిబవరి 19న సెలవులపై ఆమె ముంబైకి వచ్చింది. ఫిబ్రవరి 19న దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే.. తనిఖీల సందర్భంగా అక్కడి అధికారులు ఆమె పాస్‌పోర్టులో తప్పుడు వివరాలు నమోదైనట్టు గుర్తించారు. గతేడాది ఆమె దుబాయ్‌ను భారత్‌కు మార్చి 14న వచ్చినట్టు రికార్డుల్లో నమోదైంది. అయితే..యువతి పాస్ పోర్టులో మాత్రం మార్చి 20న వచ్చినట్టు రాసుంది.

దీంతో అప్రమత్తమైన అధికారులు యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెబుతూ తొలుత తప్పించుకునే ప్రయత్నం చేసిన యువతి..ఆ తరువాత నిజం అంగీకరించింది. స్నేహితుడితో తాను గోవా వెళ్లిన విషయాన్ని తన కుటుంబ సభ్యుల నుంచి దాచిపెట్టేందుకు నకిలీ రబ్బర్ స్టాంప్‌తో పాస్‌పోర్టులో వివరాలు మార్చినట్టు ఒప్పుకుంది. మరోకారణమేదీ లేదంటూ బోరన విలపించింది. దీంతో పోలీసులు యువతిపై ఫోర్జరీ, చీటింగ్ కేసును నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు ఫిబ్రవరి 22 వరకూ రిమాండ్ విధించింది.