అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా కీలకాంశాలపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. కొన్ని సంక్షేమ పథకాల అమలు తీరుపై కేబినెట్ సమీక్ష చేయనున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ మేరకు కేబినెట్ భేటీ జరగనుంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సహా.. వివిధ కీలకాంశాలను చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరిగే సమావేశంలో దాదాపు 23 అంశాలతో కూడిన అజెండాపై చర్చించనున్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం ప్రకటించారు.కేబినెట్‌ భేటీలోనూ దీనిపై చర్చించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇప్పటికే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలంటూ ప్రధానికి లేఖ రాసిన జగన్‌ మంత్రివర్గంలో తీర్మానం ద్వారా కేంద్రాన్ని మరోసారి కోరే అవకాశం ఉంది.అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ మీద చర్చించి సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.మార్చి మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకుంటారు.ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అంశంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.మార్చి 4వ తేదీన తిరుపతి వేదికగా సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఇప్పటికే ప్రభుత్వం అజెండాను సిద్ధం చేసుకుంది.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు ప్రత్యేక హోదాఫై కూడా చర్చిస్తారు.విభజన హామీల పరిష్కారానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ప్రస్తావించాలని ప్రభుత్వం​ భావిస్తోంది.