దేశంలో గత కొన్నిరోజులుగా మళ్లీ పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు.. నిన్న కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,584 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది. అయితే అంతక్రితం రోజు(14,199)తో పోలిస్తే సోమవారం దాదాపు 25శాతం తక్కువ కేసులు నమోదుకావడంగమనించాలి. అంతేగాక, కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం. 

గడిచిన 24 గంటల్లో మరో 13,255 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,07,12,665 మంది కొవిడ్‌ నుంచి క్షేమంగా బయటపడగా.. రికవరీ రేటు 97.24శాతంగా ఉంది. యాక్టివ్‌ కేసులు కూడా మరోసారి 1.5లక్షల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,47,306 క్రియాశీల కేసులుండగా.. యాక్టివ్‌ రేటు 1.34శాతంగా ఉంది. ఇక మహమ్మారి కారణంగా నిన్న మరో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు 1,56,463 మంది వైరస్‌కు బలయ్యారు. 

మహారాష్ట్రలో 6 ,000 కంటే తక్కువ కేసులు

మహారాష్ట్రలోనూ కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. మూడు రోజుల తర్వాత కొత్త కేసులు 6వేలకు దిగువనే నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రంలో 5,210 కొవిడ్‌ కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 21,06,094కు పెరిగింది. ఇక వైరస్‌ కారణంగా నిన్న 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 51,806కు చేరింది. నిన్న మరో 5,035 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,113 యాక్టివ్‌ కేసులున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.