హెల్మెట్‌ లేకుండా, ద్విచక్ర వాహనం పై అతివేగంతో వెళ్తూ అజాగ్రత్తగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టారు.. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడి పరిస్థితి విషమంగా ఉండగా, రోడ్డు దాటుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన శంకరయ్య(58) జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రంగానగర్‌లో ఉంటున్న తన కూతురు ఇంటికి గత రెండు రోజుల కిందట వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి కిరాణా షాపునకు వెళ్లారు.. షాపు నుంచి బయటకు వచ్చి డబ్బులు పర్సులో పెట్టుకొంటూ అజాగ్రత్తగా రోడ్డు దాటుతున్నారు.. అదే సమయం లో చింతల్‌ గణేశ్‌ నగర్‌కు చెందిన శివసాయి వెంకట్‌గౌడ్‌(21) అనే విద్యార్థి బైక్‌పై కుత్బుల్లాపూర్‌ నుంచి ఐడీపీఎల్‌కు హెల్మెట్‌ లేకుండా అతివేగంతో వస్తూ.. చింతల్‌ బస్టాప్‌ వద్ద అతడిని ఢీకొట్టారు. అదే వేగంతో పక్కనే ఉన్న డివైడర్‌కు ఢీకొని ఎగిరి.. ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం, దాని వెనకాల వచ్చిన కారుకు తగిలి కిందపడిపోయారు.. తీవ్ర గాయాలు అయిన అతడిని స్థానికులు స్థానిక సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.. వెంకట్‌గౌడ్‌ తలకు తీవ్రమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, శంకరయ్యకు కుడిచెయ్యి విరగడంతోపాటు తీవ్ర గాయాలయినట్లు సమాచారం.

టిప్పర్‌ డ్రైవర్‌ అజాగ్రత్త, అతివేగం ఇద్దరి మృతికి కారణం అయింది. మద్యం మత్తులో అతివేగంతో వె ళ్తూ అదుపుతప్పి ఇద్దరు దంపతులపై బోల్తా పడగా వారు అక్కడికక్కడే మృతి చెందారు.. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ వివరాల ప్రకారం… నేపాల్‌కు చెందిన నుంలాల్‌ బండారి(40), మీనాదేవి బండారి(35) దంపతులకు ఇద్దరు పిల్లలు..బతుకుదెరువు కోసం పిల్లలను అక్కడే వదిలేసి నగరానికి వలస వచ్చి టెంపుల్‌ అల్వాల్‌లో నివాసం ఉంటున్నారు. ఇందిరాగాంధీ సర్కిల్‌ పరిధిలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో వారిద్దరు పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు.. అల్వాల్‌లోని శివాలయం వద్దకు వచ్చారు.. అదే సమయంలో సుచిత్ర వైపు నుంచి ఈసీఐఎల్‌ అశోక్‌నగర్‌కు చెందిన కె.నర్సింహ మద్యం తాగి టిప్పర్‌( టీఎస్‌ 08 యూఈ 0346)పై అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వస్తున్నారు.. శివాలయం మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి ఆ దంపతులపై బోల్తాపడింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి.. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిని గుర్తుతెలియని కారు ఢీకొనగా… అతడు మృతి చెందారు. ఈ సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం…బహదూర్‌పల్లికి చెందిన తుడుం యాదయ్య(64) దుండిగల్‌ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడు. ఇటీవల కాలుకు దెబ్బ తగలడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో శ్రీరాంనగర్‌ గడ్డ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ పంపు వద్ద రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో గండిమైసమ్మ చౌరస్తా వైపు నుంచి సూరారం వైపునకు వెళుతున్న గుర్తుతెలియని కారు వేగంగా దూసుకువచ్చి అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన యాదయ్యను సూరారంలోని మల్లారెడ్డి వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కూతురు మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి గుర్తు తెలియని వ్యక్తి బలయ్యారు.. అతివేగంగా దూసుకొచ్చిన బస్సు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లాఖాన్‌ వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(45) సోమవారం ఉదయం చాదర్‌ఘాట్‌లోని బస్టాప్‌ నుంచి కేడియా కళాశాల వైపునకు వెళ్లడానికి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో ఉప్పల్‌ నుంచి కోఠికి వేగంగా వస్తున్న ఉప్పల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 11 జెడ్‌ 2691) అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. మృతికి కారకుడైన ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి సంబంధికులు ఎవరైనా ఉంటే ఫోన్‌ : 9963454491లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ కోరారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ అర్చకుడు మృతి చెందారు. ఈ సంఘట ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు కథనం మేరకు..మేడిపల్లి సమీపంలోని విష్ణుపురి కాలనీకి చెందిన కె.పాండురంగాచార్యులు(65) ఈఎస్‌ఐ దవాఖాన ఎదురుగా ఉన్న విజయలక్ష్మి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న సాయంత్రం 6 గంటల సమయంలో గుడి నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని గుడి సిబ్బంది సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స చేయించుకునేందుకు ఆర్థికస్తోమత లేకపోవడంతో అక్కడ నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. మృతుడి కుమారుడు విష్ణువర్ధన్‌చార్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.