దేశంలో మరోసారి ఇంధన ధరలు మంగళవారం పెరిగాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 38పైసల వరకు పెంచాయి. ఇటీవల దేశంలో ఇంధన ధరలు వరుసగా 12 రోజులు పెరిగిన విషయం తెలిసిందే. ఆ వరుస పెరుగుదలకు రెండు రోజులు విరామం ఇచ్చి..అనంతరం ఈ రోజు మళ్లీ పెరగడం గమనార్హం. దిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35పైసలు పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93గా, డీజిల్ ధర రూ.81.32గా నమోదైంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36పైసలు, డీజిల్‌పై 38పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.54, డీజిల్ ధర రూ.88.69గా నమోదైంది. కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల జేబులు ఖాళీ చేయడంలో మోదీ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇదిలా ఉండగా పెట్రో ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి స్పందిస్తూ..‘పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు అధిక లాభాల కోసం ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఆ కారణంగానే ఇంధన ధరలు పెరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు. కాగా గత 54రోజుల్లో చమురు ధరలు 25సార్లు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.50పెరిగాయి.
నగరం | పెట్రోల్ ధర | డీజిల్ ధర |
దిల్లీ | రూ.90.93 | రూ.81.32 |
ముంబయి | రూ.97.34 | రూ.88.44 |
హైద్రాబాద్ | రూ.94.54 | రూ.88.69 |
బెంగళూరు | రూ.93.98 | రూ.86.21 |