కేరళలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ సరిహద్దులోని 13 ఎంట్రీ పాయింట్లను మూసేసింది. కేరళ నుంచి కర్ణాటకలోకి రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. కేరళలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక అధికారులు సోమవారం (ఫిబ్రవరి 22) తెలిపారు. అయితే.. ఈ నిర్ణయంపై కేరళ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వయనాడ్, కసరగోడ్ జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. కర్ణాటక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మంగళూరు-కేరళ హైవేను మూసేస్తామని హెచ్చరించారు.

కర్ణాటక సరిహద్దులో కేరళ గ్రామాలకు చెందిన చాలా మంది వివిధ పనుల కోసం నిత్యం కర్ణాటక రాష్ట్రానికి వస్తారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కోసం ఎక్కువగా కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు వస్తారు. అంతేకాకుండా కేరళలోని వయనాడ్, కసరగోడ్ జిల్లాలకు చెందిన చాలా మంది కర్ణాటకలో పంట భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం వీరు నిత్యం కర్ణాటక సరిహద్దు దాటుతారు. కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘కేరళ ప్రజలు కరోనా నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు. ఆరుబయటకి వస్తే మాస్కులను తప్పనిసరిగా ధరిస్తారు. భౌతిక దూరం పాటిస్తారు. కర్ణాటకలో మాత్రం అలా జరగట్లేదు. అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని కసరగోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నెల్లికున్ను అన్నారు.

‘కేరళ నుంచి కర్ణాటకకు వెళ్లే వారికి ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. సరిహద్దుల వద్ద నెగటివ్ రిపోర్టును చూపిస్తేనే అనుమతిస్తున్నారు. అలాంటప్పుడు సరిహద్దులను మూసివేయడం ఎందుకు? అని నెల్లికున్ను ప్రశ్నించారు.