ఈసారి బడ్జెట్‌‌లో హెల్త్‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మెడికల్ డివైజెస్‌‌, సర్జికల్స్‌‌, మెడిసిన్‌‌కు ఎక్కువ మొత్తంలో బడ్జెట్‌‌ను కేటాయిస్తామన్నారు. సోమవారం ఆయన బడ్జెట్‌‌ ప్రతిపాదనలపైహెల్త్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. సుమారు రూ.8500 కోట్ల అంచనా వ్యయంతో రెడీ చేసిన ప్రపోజల్స్‌‌ను ఆఫీసర్లు మంత్రికి వివరించారు. ఈ ప్రపోజల్స్‌‌లో పలు మార్పులు చేయాలని మంత్రి వారికి సూచించారు. మీటింగ్ తర్వాత మంత్రి మీడియాతో చిట్‌‌చాట్ చేశారు. హెల్త్ సెక్టార్‌‌‌‌కు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌‌‌‌ నిర్ణయించారని చెప్పారు. కేంద్రం నుంచి కూడా ఈసారి మనకు ఎక్కువ నిధులు వస్తాయన్నారు. దాని ప్రకారం మ్యాచింగ్ గ్రాంట్స్‌‌, ఇతర బడ్జెట్ ప్రపోజల్స్ రెడీ చేశామన్నారు. ఖరీదైన ట్రీట్‌‌మెంట్ ప్రొసీజర్లు, మందులు అన్నీ ప్రభుత్వ దవాఖాన్లలోనే చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మినీ డయాగ్నస్టిక్ హబ్స్‌‌ మంచి రిజల్ట్ ఇస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా హబ్స్‌‌ విస్తరిస్తామని చెప్పారు. అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వీటన్నింటికీ ప్రపోజల్స్ రూపొందించామన్నారు.

మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌‌గఢ్, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, బార్డర్లలోని జిల్లాల హెల్త్ ఆఫీసర్లను అలర్ట్‌‌ చేశామని మంత్రి చెప్పారు. బార్డర్ గ్రామాలు, జిల్లాల్లో వైరస్ లక్షణాలు ఉన్నవాళ్లను గుర్తించి టెస్టులు చేయిస్తున్నామని చెప్పారు. పనులపై ఆయా రాష్ట్రాలకు వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్​పాటించాలని మంత్రి సూచించారు. వైరస్ వచ్చిన, లక్షణాలు కనిపించిన వాళ్లతో కాంటాక్ట్ అయితే వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రోజు 20 నుంచి 25 వేల టెస్టులు చేస్తుండగా, ఈ సంఖ్యను పెంచాలని ఆఫీసర్లకు మంత్రి సూచించారు. మార్చిలో 50 ఏండ్లు దాటినోళ్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని, అప్పుడు తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని మంత్రి చెప్పారు.