సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్యలో అతి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మర్డర్‌ ప్లాన్‌ అప్పటికప్పుడు చేసింది కాదని పక్కా ప్లాన్‌ ప్రకారమే నిందితులు హత్య చేశారనే వాస్తవం కలవరానికి గురి చేస్తుంది
. మరి మర్డర్‌ స్కెచ్‌ వేసింది ఎవరు.. అమలు చేసిందెవరు..?

వేటు కోసం ఎదురు చూశారు. అదును కోసం ఓపికగా ఆగిపోయారు. అవకాశం దొరకగానే విరుచుకుపడ్డారు. కత్తులతో రెచ్చిపోయి.. నడిరోడ్డుపై అతి దారుణంగా నరికి చంపారు. హైకోర్టు లాయర్‌ దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పక్కా రెక్కీ, పకడ్బందీ ప్రణాళిక.. అంతకు మించిన సహనం.. మర్డర్‌ కోసం మాటు వేసిన బిట్టు శ్రీను స్కెచ్‌ కలవరానికి గురిచేస్తోంది.

వామన్‌రావు దంపతులను పక్కా ప్రణాళిక, రెక్కీతో చంపినట్టు నిర్ధారణ అయింది. నాలుగు నెలలుగా అదును కోసం ఎదురుచూసి హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తమ ఆర్థిక లావాదేవీలపై దెబ్బ కొడుతుండటంతో. బిట్టు శ్రీను, కుంట శ్రీనుకు వామన్‌రావు శత్రువుగా మారాడు. అతని అడ్డు తొలగించుకుంటేనే తమ అక్రమాలు సాగించొచ్చని ఇద్దరూ ప్లాన్‌ చేశారు. శ్రీనులిద్దరూ కలిసి స్కెచ్‌ వేశారు.

లాయర్‌ దంపతుల హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్‌ చేశారు బిట్టు శ్రీను, కుంట శ్రీను. వారి చావుతో ప్రత్యర్థులంతా సైలెంట్‌ అయిపోవాలని.. అంత క్రూరంగా ఆ చావు ఉండాలని డిసైడై.. స్కెచ్‌ వేశారు. బిట్టు శ్రీనుతో కలిసి కుంట శ్రీను పది నెలలుగా వామన్‌రావును చంపేందుకు చూస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఇక వేసేయాల్సిందే అని డిసైడ్‌ అయ్యాడు. అప్పుడే కత్తులు తయారు చేయించారు నిందితులు.

ఆ కత్తులను వారి అనుచరుడు చిరంజీవి ఇంట్లో దాచారు. అప్పటినుంచి వామన్‌రావుపై నిఘా పెట్టారు నిందితులు. ఎప్పుడు ఎటు వెళ్తున్నాడు అనే దానిపై ఫోకస్‌ చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు ఒంటరిగా వచ్చిన విషయాన్ని తెలుసుకొని తమ ప్లాన్‌ అమలుకు ఇదే తగిన సమయమని నిర్ధారించుకొని రంగంలోకి దిగారు.

ఎప్పటినుంచో వామన్‌రావును చంపేందుకు ఎదురుచూస్తున్న కుంట శ్రీను.. లాయర్‌ దంపతులు మంథనికి వచ్చిన విషయాన్ని బిట్టు శ్రీనుకు చెరవేశాడు. అయితే పక్కాగా సమాచారం తెలుసుకున్నాకే మర్డర్‌ స్టెప్‌ వేయాలని బిట్టు శ్రీను సూచించగా.. మరోసారి మంథని కోర్టు సమీపంలోని లచ్చయ్య ద్వారా ఆ విషయాన్ని ధృవీకరించుకున్నాడు కుంట శ్రీను. వెంటనే చిరంజీవిని కత్తులతో రావాలని సూచించాడు. కుమార్‌ సాయంతో వామన్‌రావు దంపతుల కదలికలను తెలుసుకున్న కుంట శ్రీను.. చిరంజీవితో కలిసి రామగిరి దగ్గర మాటు వేసి వారిని మట్టుబెట్టారు.

మర్డర్‌కు పక్కా స్కెచ్‌ వేసిన బిట్టు శ్రీను.. కుంట శ్రీను, చిరంజీవిని మహారాష్ట్ర వైపు పారిపోవాలని సూచించాడు. అయితే కుమార్‌తో ఫోన్‌ కాంటాక్ట్‌లో ఉండటంతో కుంట శ్రీను, చిరంజీవి పోలీసులకు చిక్కగా.. ప్రత్యేక దర్యాప్తు బృందాలు బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకున్నాయి.