దేశంలో ఏడు వేలకు పైగా కరోనా వైరస్‌ మ్యుటేషన్లు ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఐదు వేలకు పైగా కొత్త కరోనా రకాలపై సమగ్ర పరిశీలన చేసి కరోనా ఎలా మార్పులు చెందిందో సీసీఎంబీ పరిశీలించింది.అందులో పలు మ్యుటేషన్లు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. అనంతరం దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది.ఎన్‌440కే అనే కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం దేశంలో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌440కే రకం దక్షిణాది రాష్ట్రాల్లోనే విజృంభిస్తున్నట్లు సీసీఎంబీ కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ఇప్పటివరకు కోటి కరోనా కేసుల్లో కేవలం 6400 జీనోమ్‌లను కనుగొన్నారని పేర్కొన్నారు.ప్రతి వైరస్‌ ఉత్పరివర్తనం కొత్త రకం కరోనా వైరస్‌ కానక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌-19 జన్యు సమాచారం జెనెటిక్‌ కోడ్‌ను కనుగొనడంలో భారత్‌ వెనకబడి ఉందని మిశ్రా అన్నారు. .