రెండు రోజుల విరామం తర్వాత మొదలైన స్టాక్‌మార్కెట్లను బేర్‌ కకావికలం చేసింది. వరుస నష్టాలకు అడ్డుకట్ట పడొచ్చేమోనని ఆశపడిన మదుపరికి నష్టాల్నే మిగిల్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో, ఆ సెగ మన సూచీలనూ తాకింది. సెన్సెక్స్‌ కీలకమైన 50000 పాయింట్ల దిగువకు చేరగా, నిఫ్టీ 14,700 స్థాయిని కోల్పోయింది. రోజులో ఏ దశలోనూ కోలుకోలేక పోయిన సూచీలు.. చివరకు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాలలో ఉన్నాయి . బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో మదుపర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా రెండు నెలల్లోనే సెన్సెక్స్‌ ఒకరోజు అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 కేసుల పెరుగుదల కలవరపెట్టింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడినప్పటికీ.. సెంటిమెంట్‌ బలోపేతం కాలేదు. 16 పైసలు పెరిగిన రూపాయి 72.49 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌, సియోల్‌ నష్టపోగా.. టోక్యో లాభపడింది. ఐరోపా సూచీలు నీరసంగానే ట్రేడయ్యాయి.

రూ.3.7 లక్షల కోట్ల సంపద ఆవిరి: సోమవారం బేర్‌ దెబ్బకు కుదేలైన స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లకు చుక్కలు చూపించింది. బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3.71 లక్షల కోట్లు తగ్గి రూ.200.26 లక్షల కోట్లకు పరిమితమైంది. ట్రేడింగ్‌ సమయంలో, మదుపర్లు నిమిషానికి రూ.1000 కోట్లకు పైగా సంపదను పొగొట్టుకున్నట్లయ్యింది.

సెన్సెక్స్‌ ఉదయం 50,910.51 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏదశలోనూ కోలుకోలేకపోయింది. లాభాల్లోకి రావడానికి ప్రయత్నించినప్పుడల్లా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఒకానొకదశలో 49,617.37 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్‌, చివరకు 1145.44 పాయింట్ల నష్టంతో 49,744.32 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 306.05 పాయింట్లు క్షీణించి 14,675.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,635.05- 15,010.10 పాయింట్ల మధ్య కదలాడింది. గత అయిదు సెషన్లలో సెన్సెక్స్‌ 2,409.81 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్లు చొప్పున నష్టాలు చవిచూశాయి.


ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌ రుణాన్ని మోసపూరిత ఖాతాగా గుర్తించిన నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్‌ షేరు 3.96 శాతం నష్టంతో రూ.66.65 వద్ద ముగిసింది. నీదాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూల్లోని విద్యుత్‌ సరఫరా కంపెనీలో 51 శాతం వాటా కొనుగోలుకు అతిపెద్ద బిడ్డర్‌గా నిలవడంతో టొరెంట్‌ పవర్‌ షేరు ఇంట్రాడేలో రూ.385.45 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.91 శాతం లాభంతో రూ.379.05 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 డీలాపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ అత్యధికంగా 4.77 శాతం కుదేలైంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌ 4.51 శాతం వరకు నష్టపోయాయి.

ఓఎన్‌జీసీ 1.14%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.64%, కోటక్‌ బ్యాంక్‌ 0.58% మేర పెరిగాయి.
రంగాల వారీ సూచీల్లో ఇంధన, స్థిరాస్తి, ఐటీ, టెక్‌, వాహన, యంత్ర పరికరాలు 1.34% వరకు పడ్డాయి. లోహ స్క్రిప్‌లు రాణించాయి.
బీఎస్‌ఈలో 2006 షేర్లు నష్టాల్లో ముగియగా, 1025 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 148 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.