మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. మంగళవారం(ఫిబ్రవరి 23) రాష్ట్రంలో 6218 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 51 మంది కరోనాతో మృతి చెందారు. ఈ నెల 10 నుంచి మహారాష్ట్రలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 10న 6112 కరోనా కేసులు నమోదవగా… ఫిబ్రవరి 19న 6112 కేసులు,ఫిబ్రవరి 20న 6971 కేసులు నమోదయ్యాయి.

తాజాగా విదర్భ పరిధిలోని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరిగింది. దీంతో ఆ జిల్లాలకు ఫిబ్రవరి 28 వరకూ రాకపోకలను నిషేధిస్తున్నట్లు పర్భనీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందన్నారు. పబ్లిక్,ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ రెండింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. పర్బనీ-విదర్భ ఎంట్రీ,ఎగ్జిట్ మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కేవలం అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వర్తిస్తున్నవారికే సడలింపు ఉంటుందని చెప్పారు.

మంగళవారం నమోదైన కేసులతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 21,12,312కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 51,857కి చేరింది. ఇప్పటివరకూ 20,05,851 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసుల్లో ముంబై నగరంలో 643 కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 3,20,531కి చేరింది. గత రెండు రోజుల్లో వరుసగా 900,760 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 11,449 మంది ముంబైలో కరోనాతో మృతి చెందారు.

గత గురువారం రోజువారీ కరోనా కేసుల సగటు 0.17శాతం ఉండగా తాజాగా అది 0.23శాతానికి పెరగడం గమనార్హం. కేసులు రెట్టింపు అయ్యే వ్యవధి 417 రోజుల నుంచి 305కి పడిపోయింది. తాజాగా బయటపడ్డ కేసుల్లో మహారాష్ట్ర,కేరళల్లో SARS-CoV-2 N440K,E484K అనే రెండు కొత్త వేరియంట్స్‌ను కూడా గుర్తించారు.

కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతి,అకోలా,బుల్దానా,వషీమ్,యావత్‌మల్ జిల్లాల్లో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించవచ్చునన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు.

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 12 రోజులు ముంబై నగరానికి చాలా కీలకమని ఇక్బాల్ పేర్కొన్నారు. కాబట్టి కోవిడ్ 19 నిబంధనలు పాటించనివారి పట్ల బీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.