దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్‌కు 15 రోజుల్లో టీకా తయారు చేయగలమని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. ‘ఐసొలేట్‌ చేసిన దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌, ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) నుంచి మా చేతికి వచ్చిన వెంటనే టీకా తయారీ ప్రక్రియ మొదలుపెడతాం.. ఇప్పటికే టీకా తయారీకి సంబంధించిన పనిని చాలా మేరకు పూర్తిచేసినందున, దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్‌ టీకా తయారీకి ఎక్కువ సమయం పట్టదు, 15 రోజులు చాలు’ అన్నారాయన. బయో ఆసియా- 2021 సదస్సులో భాగంగా ‘ప్రపంచానికి టీకా ఇవ్వడం’ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఎటువంటి కొత్త రకం కరోనా వైరస్‌లకు అయినా స్వల్పకాలంలోనే టీకా ఆవిష్కరించగలమని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. వైరస్‌ రూపాంతరం చెందడం సర్వసాధరణ విషయమని పేర్కొన్నారు. కొత్త రకం కరోనా వైరస్‌లకు సంబంధించి ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ల నుంచి ఎపిడమలాజికల్‌ డేటా, సీరాలజికల్‌ డేటా లభించడం ముఖ్యమని అన్నారు. ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీని మరింత పెంచేందుకు బీఎస్‌ఎల్‌- 3 ప్రమాణాలు గల మూడో యూనిట్‌ను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. ఇలాంటి రెండు యూనిట్లలో టీకా తయారీ సాగుతోంది. మూడో యూనిట్‌ ప్రారంభంతో నెలకు 4 కోట్ల డోసుల ‘కొవాగ్జిన్‌’ టీకా తయారు చేయగలమని వివరించారు. ‘కొవాగ్జిన్‌’ టీకా మూడో దశ క్లినికల్‌ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని, రెండు వారాల్లో సామర్థ్యం కూడా వెల్లడవుతుందన్నారు. ఆ తరవాత పూర్తిస్థాయిలో ఈ టీకాను ప్రజలకు అందిస్తామన్నారు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓ సారథ్యంలో ‘కొవాక్స్‌’ కార్యక్రమంలో పాలు పంచుకుంటామని వివరించారు. ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకాను కూడా ‘కొవాక్స్‌’ ద్వారా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని అన్నారు. వచ్చే ఆయిదారు నెలల్లో మరింత క్రమబద్ధంగా టీకా పంపిణీ జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు