మధ్య ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డ్రైవర్, 12 మంది అంగన్వాడి కార్యకర్తలు మొత్తం 13 మంది దుర్మరణం పాలయ్యారు. పది మంది సంఘటన జరిగిన స్థలంలోనే మరణించడం ప్రమాద తీవ్రతను సూచిస్తుంది. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కు తరలించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. 18 మంది అంగన్వాడి కార్యకర్తలు రెండు ఆటోలను మాట్లాడుకుని గ్వాలియర్ నుంచి బయలుదేరగా మార్గమధ్యలో ఒక ఆటో ఇంజిన్ లోపంతో నిలిచిపోవడంతో అంతా ఒకే ఆటోలో బయలుదేరారు. పురానీ ఛావ్నీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా మాలన్‌పూర్ వద్ద ఆటో వెళ్తోండగా.. మురైనా నుంచి గ్వాలియర్ వైపునకు వస్తోన్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి వేగంగా ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్ సహా అందులో ప్రయాణిస్తోన్న వారిలో 13 మంది మృతిచెందారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.