టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్య ఇంగ్లాండ్‌తో పుణె వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేతో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి (58 నాటౌట్: 31 బంతుల్లో 7×4, 2×6) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో తన సోదరుడు హార్దిక్ పాండ్యా (1: 9 బంతుల్లో) ఐదో వికెట్ రూపంలో ఔటవడంతో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కృనాల్ పాండ్య చివరి వరకూ టాప్‌గేర్‌లో కొనసాజి అందరి మన్ననలు పొందారు. అరంగేట్రం వన్డేల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించారు.

ఇన్నింగ్స్ 42వ ఓవర్ వేసిన శామ్ కరన్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదిన కృనాల్ పాండ్య తన ఆగమనాన్ని ఘనంగా చాటుకుని టామ్ కరన్, మార్క్‌వుడ్ బౌలింగ్‌లోనూ ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. మార్క్‌వుడ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని థర్డ్ మ్యాన్ దిశగా కృనాల్ పాండ్య కొట్టిన అప్పర్ కట్ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని కృనాల్ పాండ్య అందుకోవడం ద్వారా అరుదైన రికార్డ్‌‌ని సొంతం చేసుకున్నాడు.

భారత్ తరఫున అరంగేట్రం వన్డేలో.. అదీ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ బాదిన ఆటగాళ్లు ఇప్పటి వరకూ ఇద్దరే ఉన్నారు. 1997లో దక్షిణాఫ్రికాపై షబా కరీమ్ 55 పరుగులు చేసినప్పుడు 2009లో శ్రీలంకపై రవీంద్ర జడేజా 60 పరుగులతో నాటౌట్‌గా నిలవగా ఇప్పుడు కృనాల్ పాండ్య 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ (98: 106 బంతుల్లో 11×4, 2×6) కూడా దూకుడుగా ఆడటంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.