అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

ఖాళీ విమానాలు పంపితే అఫ్గాన్‌కు వైద్యసామగ్రి, ఆహారం తరలించొచ్చు??

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో దేశం విడిచి వెళ్లేందుకు అమెరికా, భారత్‌ తదితర దేశాల పౌరులతోపాటు స్థానికులూ కాబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తుతుండడంతో ఎయిర్‌పోర్టు లోపల, పరిసరాల్లో వారం రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గత వారం వ్యవధిలో అఫ్గాన్‌కు వాయుమార్గంలో చేరుకోవాల్సిన 500 టన్నులకు పైగా వైద్య, ఆహార సామగ్రి సరఫరా నిలిచిపోయిందని, స్థానికంగా శస్త్రచికిత్స పరికరాలు, పోషకాహార కిట్లు అందుబాటులో లేకుండా పోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి జనాభాలో సగం మంది ఇతర దేశాల సహాయం మీదే ఆధారపడి ఉంటారు. తాలిబన్ల ఆక్రమణల కారణంగా రెండు నెలల వ్యవధిలో దాదాపు మూడు లక్షల మంది నిరాశ్రయులవ్వడంతో వారందరికి ఆహారం, వైద్య సామగ్రి సరఫరా చేయడం అత్యవసరం. దానికి తోడు కరవు కారణంగా వారి అవసరాలు మరింత పెరిగాయి.

ప్రపంచ దేశాల దృష్టి అంతా ఇప్పుడు తమవారిని తరలించడం మీదే ఉంది కానీ ఇక్కడే ఉండే మిగతావారికి సహాయం అందించేందుకు మాకు సామగ్రి అవసరం! అని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి ఇనాస్ హమామ్ వివరించారు. తమ పౌరులను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ఆయా దేశాల ఖాళీ విమానాలు, మొదటగా దుబాయి, యూఏఈలోని డబ్ల్యూహెచ్‌వో గిడ్డంగులకు చేరుకుని, సామగ్రిని అఫ్గాన్‌కు తరలించాలని, ఈ దిశగా ‘మానవతా వాయు వారధి(హ్యూమానిటేరియన్‌ ఎయిర్‌ బ్రిడ్జ్‌) ఏర్పాటుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు అఫ్గాన్‌లో చిన్నారుల దుస్థితిపై యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిట్టా ఫోర్‌ స్పందిస్తూ అక్కడ దాదాపు కోటిమంది చిన్నారులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, మున్ముందు పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •