సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌, వాణిజ్య సముదాయాల్లో సరుకులు కొన్న వినియోగదారుల దగ్గర క్యారీబ్యాగ్‌ ల కోసం ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేస్తారు. అయితే ఇప్పుడు ఉచితంగా క్యారీబ్యాగ్‌లు ఇవ్వాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని తెలంగాణ వినియోగదారుల ఫోరం హెచ్చరించింది. ”క్యారీబ్యాగ్‌పై షాప్‌ లోగో ఉన్నా లేకున్నా వినియోగదారుల నుంచి డబ్బులేమీ వసూలు చేయకూడదని ఆదేశించింది. ఓయూ విద్యార్థి బెగ్లెకర్‌ ఆకాశ్‌కుమార్‌ ఫిర్యాదుపై విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆకాశ్‌కుమార్‌ 2019 మే 5న హైదర్‌గూడలోని డీమార్ట్‌లో రూ.602.70 విలువైన నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయగా క్యారీబ్యాగ్‌కు రూ.3.50 వసూలు చేయడంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుచేశాడు. దేంతో ఫోరం దీనిపై తీర్పు వెల్లడించింది. ఆకాశ్‌కుమార్‌ నుంచి వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతోపాటు పరిహారంగా అతనికి రూ.1,000, న్యాయసేవా కేంద్రానికి మరో రూ.1,000 చొప్పున 45 రోజుల్లోగా చెల్లించాలని హైదర్‌గూడ డీమార్ట్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది.