కేవలం ఏ-1, ఏ కేటగిరి స్టేషన్లలో మాత్రమే ఇప్పుడు హైస్పీడ్‌ వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్ని స్టేషన్లలో హైస్పీడ్‌ వైఫై సేవలు అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

2016 జనవరిలో రైల్వే స్టేషన్లలో వన మెగా బైట్‌ పర్‌ సెకండ్(ఎంబీపీఎస్‌) స్పీడ్‌తో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తేవాలని పథకాన్ని రూపొందించారు. తొలి దశలో ఏ-1, ఏ కేటగిరి స్టేషన్లకు ఈ వైర్‌లెస్‌ ఫిలిడిటీ (వైఫై) సదుపాయాన్ని కల్పించడం ద్వారా స్మార్ట్‌ఫోన్లను వినియోగించే ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అంచెలంచెలుగా వివిధ స్టేషన్లకు ఈ సేవలను విస్తరించి, దేశవ్యాప్తంగా 6 వేల స్టేషన్లను వైఫై పరిధిలోకి తేవాలని సంకల్పించారు. ఇందులో భాగంగా డివిజనలోని ఏ-1 కేటగిరి స్టేషన అయిన తిరుపతి, ఏ క్లాస్‌ స్టేషన్లయిన గుంతకల్లు, అనంతపురం, రాయచూరు, కడప, రేణిగుంట, ధర్మవరం స్టేషన్లకు వైఫై సదుపాయం కల్పించారు. రైల్వేస్టేషన్లకు వచ్చే ప్రయాణికులు అరగంటసేపు ఉచిత ఇంటర్నెట్‌ వినియోగించుకోవచ్చు. ఈ సేవలను మరింత విస్తరింపజేయాలన్న లక్ష్యంతో రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.

రైల్వేశాఖ ప్రస్తుతం ఏ-1, ఏ కేటగిరి స్టేషన్లకు మాత్రమే ఈ ఉచిత వైఫైను ఇస్తుండగా, ఇకపై గుంతకల్లు రైల్వే డివిజనలోని బీ, డీ, ఈ క్లాస్‌ స్టేషన్లకూ వర్తింపజేయాలని చర్యలు చేపట్టారు. డివిజనలో ఏ-1 కేటగిరి స్టేషన ఒకటి, ఏ- కేటగిరి స్టేషన్లు 6, బీ-కేటగిరి స్టేషన్లు 8, (సీ- కేటగిరి సబర్బన స్టేషన్లు గుంతకల్లు రైల్వే డివిజనలో లేవు) డీ- కేటగిరి స్టేషన్లు 9, ఈ- కేటగిరి స్టేషన్లు 90, ఎఫ్‌-కేటగిరిలో హాల్ట్‌ స్టేషన్లు 20 ఉన్నాయి. వీటిలో హాల్ట్‌ స్టేషన్లు కాకుండా మిగతా వాటిలో ఈ హైస్పీడ్‌ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 6 వేలు, దక్షిణ మధ్య రైల్వేలో 588, గుంతకల్లు డివిజనలో 114 రైల్వే స్టేషన్లలో ఈ ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించనున్నారు.

స్మార్ట్‌ఫోన్లు, లాప్టాప్ లు కలిగిన ప్రయాణికులు హాల్ట్‌ స్టేషన్లు మినహా ఇతర అన్నిస్టేషన్లలో అరగంట సేపు ఉచితంగా వాడుకోవడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లేని చోట కూడా రైల్‌ వైర్‌, రైల్‌ నెట్‌ ద్వారా ఈ వైఫై సేవలను ప్యాసింజర్లకు సమకూరుస్తారు. గాడ్జెట్లలో వైఫై ఐకాన్ బటన్ ను యాక్టివేట్‌ చేసి, రైల్‌ వైర్‌ ఆప్షనను ఎంపిక చేసుకుంటే ఫోన్ నెంబరుకు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా ఇంటర్నెట్‌ సేవలను పొందవచ్చు. అరగంట తర్వాత కూడా ఇంటర్నెట్‌ సేవలు అవసరమైన ప్రయాణికులకు నామమాత్రపు ధరతో ఇంటర్నెట్‌ డేటాను వాడుకునేలా అందుబాటులోకి తేనున్నారు. ఆనలైన్ పేమెంట్‌ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రోజుకు రూ.10 చెల్లించి 5 జీబీ, రూ.15కి 10 జీబీ, డేటా, ఐదు రోజులకు రూ.20కి 10 జీబీ, రూ.30కి 20 జీబీ, పది రోజులకు రూ.40కి 20 జీబీ, రూ.50కి 30 జీబీ, 30 రోజులకు రూ. 70 రీచార్జితో 60 జీబీ డేటాను వినియోగించుకునేలా టారిఫ్‌ రూపొందించారు. సాధారణంగా నెలకు రోజూ 2 జీబీల డేటాను పొందాలంటే ప్రైవేటు నెట్‌వర్క్‌లకు వినియోగదారులు రూ.200కిపైగా చెల్లిస్తున్నారు. అంత చెల్లించినా ఇంటర్నెట్‌ ఒక ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో లభించడం లేదు. దీనికి రైల్వే శాఖ కేవలం రూ.70 చార్జ్‌ చేయనుంది.