తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో రెండు రోజుల క్రితం ములుగు జిల్లా వెంకటాపురం మండలం కె.కొండాపురానికి చెందిన తెరాస కార్యకర్త, మాజీ సర్పంచి కొర్స రమేశ్‌(33)ని రెండు రోజుల క్రితం అపహరించి ఆయనను హత్య చేశారు.

జిల్లా సరిహద్దులోని ప్రధాన మార్గానికి 8 కి.మీ దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కొత్తపల్లి శివారు అంతర్గత దారిపై ఆయన మృతదేహాన్ని పడేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఏటూరునాగారంలో నివాసం ఉంటున్న కొర్స రమేశ్‌ ఈ నెల 20న ద్విచక్రవాహనంలో వెంకటాపురం మండలం తిప్పాపురానికి చెందిన స్నేహితుడు కుర్సం రమేశ్‌తో కలిసి భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భీమారం వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు తనతో మాట్లాడాలని పిలిచినట్టు భార్యకు చెప్పారు.

అక్కడకు వెళ్లిన తరువాత ఇరువురినీ అపహరించిన మావోయిస్టులు అడవుల్లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అపహరించిన ప్రాంతంలోనే బుధవారం అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నోట్లో తుపాకీ పెట్టి కాల్చినట్టు ఆనవాళ్లనుబట్టి తెలుస్తోందని, రక్తపు మరకల ఆధారంగా బుధవారమే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఆయనతోపాటు వెళ్లిన కుర్సం రమేశ్‌ను విడిచిపెట్టినట్లు తెలిపారు. మరోపక్క హత్య ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగినందున పంచనామా అక్కడే జరగాలని వెంకటాపురం పోలీసులు పేర్కొనడంపై వివాదం చెలరేగింది. చివరకు స్థానికంగా పంచనామా నిర్వహించడానికి సీఐ అంగీకరించడంతో సద్దుమణిగింది.

మృతదేహం వద్ద మావోయిస్టులు వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖను వదిలిపెట్టగా దానిలో ‘రమేశ్‌ అనే వ్యక్తిని వెంకటాపురం ఎస్సై జి.తిరుపతి ఇన్‌ఫార్మర్‌గా మార్చారు. మేం అడిగే సామగ్రిని అతనితో పంపుతూ సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా మా కదలికలను గుర్తించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విషం కలిపిన పాలపొడిని మాకు సరఫరా చేశారు. దాన్ని తాగిన దళ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు. ఓ మావోయిస్టు మ్యాదరి భిక్షపతి అలియాస్‌ విజేందర్‌ అమరుడయ్యారు. మావోయిస్టు పార్టీకి ద్రోహంచేసి పోలీసుల నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. ప్రజాభిప్రాయం మేరకు అతన్ని చంపుతున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. తాను చేసిన తప్పులను రమేశ్‌ ప్రజాకోర్టులో అంగీకరించినట్టుగా ఉన్న వాయిస్‌ రికార్డును కూడా మావోయిస్టులు వాట్సప్‌లో విడుదల చేయడం గమనార్హం!