బస్‌పాస్‌ల జారీలో టీఎస్‌ ఆర్టీసీ దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని, సుఖవంతమైన, సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్పుకుంటున్న ఆర్టీసీ ప్రయాణికులకు సేవల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు వినవస్తున్నాయి. మరో వైపు కనిపించకుండా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులను అయితే రెండు రకాలుగా టీఎస్‌ ఆర్టీసీ ముంచుతోంది.

నెలవారీగా జారీ చేసే పాస్‌లలో తమకు అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. పరిస్థితులు అనుకూలించక అనారోగ్యంతో కానీ, మరే ఇతర కారణాలతో ఆలస్యంగా విద్యార్థి పాస్‌ తీసుకుంటే ఆలస్యం అయినందుకు అపరాధ రుసుం వసూలు చేయడంతో పాటు రోజులు తగ్గిస్తున్నారని విద్యార్థులు మొత్తుకుంటున్నారు. ఆలస్యం అయినందుకు రూ.10 వసూలు చేయడంతో పాటు రోజులు తగ్గిస్తున్నారని తెలిపారు.

ఈ నెల 21న (మంగళవారం) పాస్‌ రెన్యువల్‌ చేయించుకుంటే రూ.70 చార్జీతో పాటు రూ.10 లేట్‌ ఫీ, రూ.20 సర్వీస్‌ చార్జీ తీసుకుని జనవరి 16వ తేదీ వరకు మాత్రమే బస్‌పాస్‌ జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ నెల 21న పాస్‌ తీసుకుంటే వచ్చే నెల 20వ తేదీ గడువుతో పాస్‌ జారీ చేయాలి. అయితే 4 రోజులు తగ్గించి జారీ చేస్తున్నారు. ఆలస్యపు రుసుంతో పాటు నెల రోజులకు డబ్బులు తీసుకుని 24 రోజులకు మాత్రమే పాస్‌ ఎలా జారీ చేస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నారు.