దేశంలో మరో ఎన్నికల జరగబోతున్నాయి. నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోడీ.. మార్చి తొలివారంలోగా మినీ సంగ్రామం మొదలవుతుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ మార్చి 7లోగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.”2016లో ఈ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మార్చి 4న విడుదలైంది. ఈ సంవత్సరం నా అంచనాల మేరకు మార్చి 7లోగా షెడ్యూల్ ను ఈసీ ప్రకటిస్తుంది” అని మోడీ వ్యాఖ్యానించారు.

మార్చి మొదటి వారంలో కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోడీ భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఆరు పరివర్తన ర్యాలీలను నిర్వహించగా, ఇది అతిపెద్ద ర్యాలీ అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. కోల్ కతాలో మోడీ సభ ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే సీఈసీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇటీవల సీఈసీ సభ్యులు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు వెళ్లి అక్కడి అధికారులతో ఎన్నికల సన్నద్దతపై సమీక్షించారు. ప్రస్తుతం కేరళలో లెఫ్ట్, బెంగాల్ లో టీఎంసీ, అసోంలో బీజేపీ, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదిచ్చేరిలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నా.. కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో సోమవారం సర్కార్ కూలిపోయింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభకు షెడ్యూల్ రానుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరగనుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ సెప్టెంబర్ 16న చనిపోయారు. మార్చి 16తో ఆయన చనిపోయి ఆరు నెలలు ముగియనుంది. ఇక్కడ మార్చి 16 లోపు ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. దీంతో మార్చి7న ప్రకటించే షెడ్యూల్ లో తొలి విడతలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.