మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో  తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రెంజల్‌, బోధన్‌, నవీపేట, జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద, బోధన్‌ మండలాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోధన్‌ మండలం సాలూరు వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్‌ స్కానింగ్‌ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి పంపుతున్నారు.

మహారాష్ట్ర లోని నాందేడ్‌ జిల్లాలో అతిపెద్ద పట్టణమైన దెగ్లూర్‌ తెలంగాణలోని మద్నూర్‌ మండల కేంద్రానికి ఐదు కి.మీ దూరంలో ఉంది. మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌ వాసులు ఏదో ఓ పనిమీద ఇక్కడికి వెళ్తుంటారు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలు వ్యాపారులు ముంబయికి వెళ్తుంటారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొంటారు. ప్రస్తుతం మహారాష్ట్రకు నిత్యం ఆరు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవికాకుండా వారంలో రెండ్రోజులు నడిచే రైళ్లు మరో నాలుగు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌ స్టేషన్‌కు రైలు వచ్చిన సమయాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.